![రూమ్‌బోట్ కుర్చీలు!](/styles/webp/s3/article_images/2017/09/2/81400883262_625x300.jpg.webp?itok=Da5GeSlh)
రూమ్‌బోట్ కుర్చీలు!
ఇంట్లో రకరకాల పనులను చేసిపెట్టే పలు రోబోల గురించి మనకు ఇదివరకే తెలుసు. అయితే చిత్రంలో రెండు పెద్ద సైజు పాచికలు అతుక్కుని ఉన్నట్లు కనిపిస్తున్న ఈ బంతులు కూడా అలాంటి రోబోలే. మనం ఆర్డరేస్తే చాలు.. వెంటనే దొర్లుకుంటూ వెళ్లి ఓ టేబుల్‌గా లేదా చైర్‌గా లేదా స్టూల్‌గా ఎలా కావాలంటే అలా అమరిపోతాయి. రూమ్‌బోట్స్ అనే రోబోలు ఒక్కోటి 9 అంగుళాల సైజు ఉంటాయి. ఓ బ్యాటరీ, మూడు చిన్న మోటార్ల సాయంతో స్వతంత్రంగా పనిచేస్తూ అవసరమైనప్పుడు ఇతర రోబోలకు, వస్తువులకు కొక్కేల ద్వారా అతుక్కుంటాయి. అన్ని దిక్కులకూ తిరగగలిగే ఈ రూమ్‌బోట్స్ రకరకాల ఆకారాల్లోకి అమరడమే కాదు.. గదిలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లి ఆయా వస్తువులను తరలించేందుకు, ఇతర పనులకూ ఉపయోగపడతాయట. సొంతంగా పనులు చేసుకోలేని వికలాంగులు, వృద్ధులకు ఈ రూమ్‌బోట్స్ బాగా సాయం చేస్తాయని వీటిని తయారు చేసిన స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు అంటున్నారు.