విమానాశ్రయంలో కాల్పులు
• అమెరికాలోని ఫ్లోరిడాలో మాజీ సైనికుడి దుశ్చర్య
• ఐదుగురి మృతి..8 మందికి గాయాలు
ఫ్లోరిడా: అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్–హాలీవుడ్ విమానాశ్రయంలో మాజీ సైనికుడు శుక్రవారం కాల్పులకు తెగబడ్డాడు. బ్యాగుల తనిఖీ ప్రాంతంలో విచక్షణరహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. 26 ఏళ్ల ఆ మాజీ సైనికుడిని ఎస్టెబన్ శాంటియాగోగా గుర్తించారు. విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన శాంటియాగో తనిఖీల తర్వాత తన బ్యాగులోనుంచి అన్‌లోడ్ తుపాకీని బయటకు తీసి బాత్‌రూములోకెళ్లి లోడ్ చేసుకుని తిరిగివచ్చి విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఉలిక్కిపడిన ప్రయాణికులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు.
రంగంలోకి దిగిన పోలీసులు మాజీ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతను కాల్పులకు తెగబడడం వెనకున్న ఉద్దేశమేంటో వెంటనే వెల్లడవలేదు. ఘటన నేపథ్యంలో విమానాశ్రయంలోని అన్ని సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాస్కా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో పనిచేసిన శాంటియాగో పనితీరు సరిగా లేనందున ఏడాదిక్రితం తొలగించారు. శాంటియాగో తొమ్మిదేళ్లపాటు సేవలందించాడని, ఇందులో పదినెలలపాటు ఇరాక్‌లో పనిచేసినట్టు సైన్యం తెలిపింది. శాంటియాగో మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇటీవల చికిత్స తీసుకున్నట్టు అతని సోదరుడు తెలిపినట్టు సమాచారం. ఐఎస్‌ఐఎస్‌పై పోరు చేయాలంటూ తనను అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ ఒత్తిడి చేస్తోందని అతను ఎఫ్‌బీఐతో చెప్పినట్టు తెలుస్తోంది.