చేపా.. చేపా ఎందుకు చిక్కావ్?
చేపలు పట్టడం అంత ఈజీ కాదు..కానీ ఇక్కడ చేపలు వాటంతట అవే వచ్చి చిక్కుతాయి!. మనం వల పట్టుకుంటే చాలు.. వచ్చి వాలిపోతాయి! ఇంతకీ ఇదెలా సాధ్యం? అందుకే అడిగేద్దాం.. చేపా.. చేపా ఎందుకు చిక్కావ్ ?
ఇది తైవాన్‌లోని మత్స్యకారులకే సొంతమైన కళ. దీన్ని ఫైర్ ఫిషింగ్ అంటారు. వందల ఏళ్ల క్రితం జపాన్ రాజుల పాలనలో ఉన్నప్పుడు ఈ తరహా చేపల వేట ప్రారంభమైందట. ఇందులో భాగంగా వీరు గంధకంతో తయారుచేసిన ద్రవంతో కాగడాను వెలిగిస్తారు.. పడవకు దగ్గర్లో వల వేసి ఉంచుతారు. అంతే.. అంతవరకూ నీటిలో ఉన్న చేపలు ఇలా నిప్పు వైపు దూకుతాయి. వలలో వచ్చి పడతాయి. అయితే.. అన్ని రకాల చేపలు ఇలా పడవు. కవ్వాలు అనే రకం చేపలు వెలుగు వైపు ఎక్కువగా ఆకర్షితులవుతాయట. దాంతో వాటిని పట్టుకోవడానికి ఈ టెక్నిక్‌ను వాడతారు. వాటి బలహీనతే వీరి బలమన్నమాట.
అయితే.. ఒకప్పుడు 300 పడవలు ఈ తరహా చేపల వేటలో ఉండేవి. ప్రస్తుతం అవి మూడు పడవలకు పరిమితమైంది. జిన్షాన్ హార్బర్ మాత్రమే ఫైర్ ఫిషింగ్ కొనసాగుతోంది. సునాయాసంగా వేలాది చేపలు చిటికెలో పట్టే చాన్సు ఉన్నా.. ఈ సంప్రదాయం ఇలా క్షీణించుకుపోవడానికి కారణం.. ఈ కవ్వాలు చేపల సీజన్ మే నుంచి జూలై వరకే పరిమితం. అంటే మూడు నెలలే అన్నమాట. దీనికితోడు యువతరం దీనిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఉద్యోగాల వేటలో వారున్నారు. సీజన్ మూడు నెలలకే పరిమితమవడం.. చేపలు పట్టడంలో ఆధునిక పద్ధతులు రావడం కూడా దీనిపై ప్రభావం చూపుతోంది. ఈ సంప్రదాయాన్ని బతికించడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నా.. పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. ప్రస్తుతం ఫైర్ ఫిషింగ్ చేస్తున్న మత్స్యకారులంతా 60 ఏళ్లకు పైబడ్డవారే కావడం గమనార్హం.