మహిళలకు ప్రమోషన్లు... పురుషులకు చీవాట్లు
సిడ్నీ: మహిళా ఉద్యోగులు సక్సెస్ బాటపట్టగా, పురుష ఉద్యోగుల నుంచి మాత్రం ఆశించిన ఫలితాలు రావడంలేదట. ప్రైవేట్ కంపెనీ బెయిన్ తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఆయా సంస్థలు, ఆఫీస్ వాతావరణానికి అనుకువగా, ఎన్నో విషయాల్లో అందరితో కలిసిపోయి టీమ్ అభిప్రాయాల్ని గౌరవిస్తూ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న పురుష ఉద్యోగులు చాలా అసంతృప్తితో ఉంటున్నట్లు వెల్లడవ్వడం గమనార్హం. ఒకే తీరుగా పురుష, మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. మహిళలు ప్రమోషన్స్ మెట్లు ఎక్కుతుండగా.. పురుష ఉద్యోగులు మాత్రం తమ బాస్ ల పెట్టే చీవాట్లతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం జరుగుతున్నట్లు గమనించారట.
ఆస్ట్రేలియాకు చెందిన 1,030 మంది పురుష, మహిళా ఉద్యోగులపై రీసెర్చర్స్ ఇటీవలే ఓ సర్వే నిర్వహించారు. ఆయా ఉద్యోగులు తాము పనిచేస్తున్న కంపెనీకి అనుగుణంగా తమ ప్లానింగ్, విధానాలను తయారుచేసుకోవడం.. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయన్న అంశంపై అధ్యయన బృందం దృష్టిపెట్టింది. లీవ్, పని వేళలు, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ అంశాలలో తాము ఏ విధంగా ఫీలవుతున్నారని వెయ్యి మందిపై కొన్ని ప్రశ్నలు వేసి ఈ విషయాలను తమ సర్వేలో పేర్కొన్నారు.
కేవలం మహిళలకు మాత్రమే తమకు నచ్చిన పనివేళలు కల్పిస్తున్నారని, మా విషయంలో బాస్ లు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ వ్యక్తి వాపోయాడట. కేవలం 48 శాతం సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అమలు చేస్తుందన్నది వాస్తవం. మహిళా ఉద్యోగులకు అవకాశాలు కల్పించాలని కంపెనీలు భావించి వారికి వీలైన పనివేళలు కల్పిస్తోందని మెల్బోర్న్ వర్సిటీకి ప్రొఫెసర్ జెస్సే ఓస్లెన్ పేర్కొన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు పురుషుల విషయంలో మెరుగుపరిస్తే వారి నుంచి ఉద్యోగుల శాతంలో పెరుగుదల కనిపిస్తోందని, వారి కెరీర్ వృద్ధిలోనే కొనసాగుతుందని వివరించారు.