ఊచకోత కారకుడు మృతి | Former Chinese PM Li Peng Passes Away | Sakshi
Sakshi News home page

చైనా మాజీ ప్రధాని లీపెంగ్‌ కన్నుమూత

Published Wed, Jul 24 2019 8:04 AM | Last Updated on Wed, Jul 24 2019 8:06 AM

Former Chinese PM Li Peng Passes Away - Sakshi

బీజింగ్‌: చైనా మాజీ ప్రధాని, తియానన్మెన్‌ స్క్వేర్‌లో వేలాది మంది ఊచకోతకు కారకుడు లీపెంగ్‌(90) కన్నుమూశారు. నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ లీపెంగ్‌ అనారోగ్యంతో సోమవారం బీజింగ్‌లో మృతి చెందినట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఇంతకుముందు ఆయన మూత్రాశయ కేన్సర్‌తో బాధపడ్డారు. 1989లో దేశ రాజధాని బీజింగ్‌లోని తియానన్మెన్‌ స్క్వేర్‌లో ప్రజాస్వామ్యవాదులు కొన్ని వారాలపాటు శాంతియుత నిరసనలు తెలిపారు. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న లీపెంగ్‌ బీజింగ్‌లో మార్షల్‌ లా విధించారు. అయినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. దీంతో 1989 జూన్‌ 3, 4వ తేదీల్లో తియానన్మెన్‌ స్క్వేర్‌లో బైఠాయించిన నిరసనకారుల పైకి సైన్యాన్ని పంపారు. యుద్ధట్యాంకులతో వారిని నిర్దాక్షిణ్యంగా తొక్కించారు. దీంతో నిరాయుధులైన వెయ్యి మందికి పైగా యువకులు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

ప్రజాస్వామ్యం కోసం జరిగిన పోరాటాన్ని చైనా ఉక్కుపాదంతో అణచివేయడంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. అప్పటి నుంచి లీ పెంగ్‌ ప్రపంచం దృష్టిలో అణచివేతకు ప్రతిరూపంగా, బీజింగ్‌ కసాయి (బుచర్‌ ఆఫ్‌ బీజింగ్‌)గా నిలిచిపోయారు. సైనిక చర్య చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ఏకగ్రీవ నిర్ణయమైనప్పటికీ, ఈ ఘటనకు లీపెంగ్‌నే బాధ్యుడిగా భావిస్తారు. ఆయన ఆ తర్వాత కూడా తన నిర్ణయాన్ని ‘అవసరమైన చర్య’గా సమర్థించుకున్నారు. ‘ఇలాంటి చర్యలు తీసుకోకుంటే ఒకప్పటి సోవియట్‌ యూనియన్, పశ్చిమ యూరప్‌ల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలకు పట్టిన గతే చైనాకూ పట్టేది’ అని 1994లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా లీపెంగ్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement