తల్లి కళ్లెదుటే చిన్నారి తల నరికేశాడు!
తైపీ: తైవాన్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ గుర్తుతెలియని దుండగుడు కన్నతల్లి కళ్లెదుటే అభంశుభం తెలియని ఓ చిన్నారి తల నరికివేశాడు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజధాని తైపీలో నిన్న ఉదయం మెట్రో స్టేషన్ కు ఓ తల్లీ,కూతురు వెళ్తున్నారు. బాలిక చిన్న సైకిల్ తొక్కుకుంటూ వస్తుంది. ఇంతలోనే ఓ గుర్తుతెలియని దుండగుడు వారిద్దరిని ఫాలో అయ్యాడు. కొంతసేపటి తర్వాత ఆ దుండగుడు తమను సమీపించాడని బాలిక తల్లి తెలిపింది.
ఆ సమయంలో తన కూతురు సైకిల్ నడుపుందని ఆ వ్యక్తి తన బేబీకి సహాయం చేయడానికి వస్తున్నాడని భావించినట్లు తెలిపింది. బాలిక వద్దకు చేరిన వెంటనే నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో చిన్నారిపై దాడికి దిగాడు. తాను ఎంత వారిస్తున్నా వినకుండా దుండగుడు చిన్నారిపై కత్తితో అఘాయిత్యానికి పాల్పడ్డాడని, అతడ్ని లాగేందుక చాలా ప్రయత్నం చేసినా లాభం లేకపోయిందని చెప్పింది. చుట్టుపక్కల ఉన్న కొందరు అక్కడికి చేరుకునే లోగానే ఆ చిన్నారి తల నరికివేసి అక్కడినుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. వారు అ దుండగుడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అదేరోజు ఉదయం మెట్రో స్టేషన్ దగ్గర్లోని ఓ సూపర్ మార్కెట్లో దాడికి పాల్పడిన కత్తిని కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి పేరు వాంగ్ అని, అతడి మానసిక స్థితి సరిగాలేదని వెల్లడించారు.