
‘ఫ్రీడమ్ ఆన్ ది నెట్–2017’ సర్వే చేసిన దేశాలు.. 65
భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదకరంగా మారిన దేశాలు.. 30
ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో భారత్ స్థానం.. 41
సాక్షి నాలెడ్జ్ సెంటర్ / తెలంగాణ డెస్క్ :
ఇంటర్నెట్.. ఇప్పుడు ప్రతి ఇంటికి చేరింది.. ఎటు వెళ్లినా, ఎక్కడున్నా మొబైల్‌ఫోన్‌లో అందుబాటులో ఉంటోంది.. అందులో సామాజిక (సోషల్) మీడియా అయితే నిత్యావసరాన్ని దాటి అత్యవసరమనే స్థాయికీ చేరింది.. అవసరాలను తీర్చడంతోపాటు సామాజిక అవగాహనకు, చైతన్యానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు కేంద్రంగా మారింది. ఈ సోషల్ మీడియా చైతన్యమే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పోరాటాలకు, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య ఉద్యమాలకు ఊపిరినిచ్చింది. కొన్నేళ్ల కింద అరబ్ దేశాల్లో నియంతృత్వాలను ఎండగట్టి, రాచరికాలను గద్దె దింపిన ‘మల్లెల విప్లవం (జాస్మిన్ రివల్యూషన్)’.. ఢిల్లీలో నిర్భయ ఘటనపై దేశవ్యాప్తంగా ఉద్యమం.. కేజ్రీవాల్, అన్నాహజారేల నేతృత్వంలో జరిగిన అవినీతి వ్యతిరేక (లోక్‌పాల్) ఉద్యమం.. ఇవన్నీ సోషల్ మీడియా ఇచ్చిన స్వేచ్ఛా మార్గం సాధించిన విజయాలు.
కానీ రెండు వైపులా పదునైన ఈ సోషల్ మీడియా కత్తికి మరోవైపున అత్యంత ప్రమాదకరమైన, దారుణమైన కోణమూ ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇదే సోషల్ మీడియాను తమకు అనుకూలంగా, తాము కోరుకున్న దానిని ప్రజల్లోకి చేర్చేలా, ఏకంగా ఎన్నికల ఫలితాలనే ప్రభావితం చేసే భారీ కుట్రలకూ మూలమవుతోంది. నియంతలు, పరిమితిలేని అధికారాన్ని చలాయిస్తున్నవారు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్), ఫైర్‌వాల్స్, కంటెంట్ ఫిల్టర్లు, బ్లాకింగ్ టూల్స్ వంటి వివిధ సాంకేతిక అంశాల ద్వారా.. భావ ప్రకటనా స్వేచ్ఛకు గండికొడుతున్నారు. తమకు వ్యతిరేకంగా, విమర్శనాత్మకంగా ఉన్న సమాచారాన్ని అడ్డుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న, తాము కోరుకున్న అంశాలు మాత్రమే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందేలా, చర్చ జరిగేలా చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో జరిగిన ఎన్నికలు ఈ విధంగా ప్రభావితమైనట్లు అమెరికాకు చెందిన ఫ్రీడంహౌస్ అనే స్వచ్చంద సంస్థ స్పష్టం చేస్తోంది. ఈ అంశంపై తాము చేసిన సర్వేలో తేలిన అంశాలతో.. ‘ఫ్రీడం ఆన్ ది నెట్–2017’పేరిట నివేదికను విడుదల చేసింది.
65 దేశాల్లో పరిశీలించి..
ప్రపంచంలో 87 శాతం ఇంటర్నెట్ సేవలను వినియోగించే 65 దేశాల్లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఫ్రీడం హౌస్ సంస్థ అధ్యయనం చేసింది. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య చోటు చేసుకున్న పరిణామాలతోపాటు పలు తాజా అంశాలను చేర్చి నివేదికను రూపొందించింది. ఈ 65 దేశాల్లో 30 దేశాలు ఆన్‌లైన్ సమాచారాన్ని వక్రీకరించాయని, ఇందుకోసం ‘సామాజిక మాధ్యమ సైన్యాల (ఆన్‌లైన్ బృందాల)’ను ఏర్పాటు చేసుకున్నాయని అందులో వెల్లడించింది. డబ్బు చెల్లించి అనుకూలంగా రాసే కాలమిస్టుల నియామకం, తప్పుడు సమాచార వార్తల సైట్లు, ప్రచార సంస్థల ఏర్పాటు వంటివాటి ద్వారా ప్రజామద్దతును పొందేందుకు నాయకులు ప్రయత్నించారని తెలిపింది. తమకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలుచుకునే విధంగా తాము కోరుకున్న అంశాలపై చర్చ జరిగేలా.. ఎన్నికలపై ప్రభావం పడేలా సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో.. ప్రభుత్వ, అధికార పార్టీలకు వ్యతిరేకంగా ఉండే సమాచారాన్ని అడ్డుకునేలా నియంత్రించారని వెల్లడించింది. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) వంటి సాధనాల ద్వారా ఫైర్‌వాల్స్, కంటెంట్ ఫిల్టర్లు, బ్లాకింగ్ టూల్స్ ద్వారా పలు సోషల్ మీడియా ఖాతాలు, పోస్టులను, వెబ్‌సైట్లను అడ్డుకున్నారని తెలిపింది. ఇలాంటి సాంకేతిక అంశాలను కనిపెట్టడం కష్టమేకాకుండా వివిధ రూపాల్లోని సెన్సార్‌షిప్, వెబ్‌సైట్ల నిలుపుదలను ఎదుర్కోవడం దుర్లభమని ‘ఫ్రీడం ఆన్ ది నెట్’అధ్యయనాన్ని ఆధ్వర్యం వహించిన సంజా కెల్లీ తెలిపారు. ఈ జాబితాలో వెనెజువెలా, ఫిలిప్పీన్స్, టర్కీ తదితర దేశాల ప్రభుత్వాలు టాప్‌లో ఉన్నాయి.
స్వేచ్ఛా ఇంటర్నెట్‌కు ప్రమాదకరం
అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు, మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు సోషల్ మీడియాను నియంత్రించడం, తమకు అనుకూలంగా ఉన్న సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఇంటర్నెట్ స్వేచ్ఛను ప్రమాదంలో పడవేస్తోందని ఫ్రీడం హౌస్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అంతేగాకుండా ఇంటర్నెట్ స్వేచ్ఛలో క్షీణత, మొబైల్, ఇంటర్నెట్ సేవల నిలుపుదల.. స్వతంత్ర మీడియాపై, మానవ హక్కుల పరిరక్షకులపై సాంకేతికంగా, భౌతికంగా దాడులు వంటివి పెరిగిపోతున్నాయని పేర్కొంది. తప్పుదారి పట్టించే సమాచారాన్ని విపరీతంగా ప్రచారంలోకి తేవడంతో అర్థవంతమైన చర్చ, వాస్తవ సమాచారం కనుమరుగై ఎన్నికల ఫలితాలు ప్రభావితమైనట్లు పేర్కొంది. ఇలా అమెరికా సహా 18 దేశాల్లో తాము కోరుకున్న నాయకులను ఎన్నుకునే సామర్థ్యాన్ని ప్రజలకు లేకుండా చేశారని విమర్శించింది. తమను గట్టిగా సమర్థించే వారి ద్వారా వివిధ రూపాల్లో ప్రభుత్వ అనుకూల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహన్ని గతంలో చైనా, రష్యా అనుసరించగా... ఇప్పుడది ప్రపంచవ్యాప్తమైందని పేర్కొంది.
సర్వే నివేదికలో పేర్కొన్న ప్రధాన అంశాలు..
⇒మొత్తం సర్వే చేసిన 65 దేశాలకుగాను 30 దేశాల్లోని ప్రభుత్వాలు సోషల్ మీడియాపై బలవంతపు ఆధిపత్యాన్ని సాధించాయి. రాజకీయ, భద్రతాపరమైన కారణాలతో మొబైల్ కనెక్టివిటీì, ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించాయి. చైనాలోని టిబెట్, ఇథియోపియాలోని ఒరోమో, భారత్‌లో కశ్మీర్‌లలో ఈ సేవలపై తరచూ ఆంక్షలు పెడుతున్నారు.
⇒ ప్రపంచవ్యాప్తంగా 40 శాతం అంటే సుమారు 120 కోట్ల మందికిపైగా ఇంటర్నెట్ వినియోగదారులు చైనా, భారత్, అమెరికాలలోనే ఉన్నారు.
⇒ స్వేచ్ఛా సమాజంగా పేరున్న అమెరికాలోనూ ఎన్నికలకు ముందు, తర్వాత కూడా తప్పుడు, నకిలీ వార్తలు, జర్నలిస్టులపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం రష్యా ఇంటర్నెట్ కేంద్రంగా వివిధ రూపాల్లో సహాయపడినట్లుగా వచ్చిన ఆరోపణలపై విచారణ సాగుతోంది.
⇒ ఆయా అంశాల ప్రాధాన్యతను తగ్గించేందుకు ఇంటర్నెట్ స్వేచ్ఛపై 14 దేశాలు నియంత్రణలు విధించాయి.
⇒ 65 దేశాల్లో 34 దేశాలు వార్తా సంస్థలు, ప్రతిపక్షాలు, హక్కుల కార్యకర్తలపై సాంతికేతికంగా సైబర్ దాడులకు దిగాయి.
⇒ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (వీపీఎన్)లను అడ్డుకోవడం కోసం ప్రస్తుతం 14 దేశాలు సెన్సార్‌షిప్‌ను విధించాయి. ఆరుదేశాల్లో వీపీఎన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిషేధించారు.
⇒ 30 దేశాల వరకు నెటిజన్లు, ఆన్‌లైన్ జర్నలిస్టులపై భౌతికదాడులు పెరిగాయి.
⇒ ప్రతిపక్షాల విమర్శలను సామాజిక మాధ్యమాల ద్వారా తిప్పికొట్టేందుకు టర్కీలో ప్రభుత్వం ఆరు వేల మందిని నియామించుకుంది.
⇒ రష్యా అనుకూల ప్రచారాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ అధికారులు రష్యా ఆధారిత సేవలను నిలిపివేశారు.
⇒ వరుసగా మూడో ఏడాది కూడా చైనా ఇంటర్నెట్ స్వేచ్ఛను అధికంగా నియంత్రించిన దేశంగా నిలిచింది. తర్వాతి స్థానాల్లో సిరియా, ఇథియోపియా ఉన్నాయి.
⇒ ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ లైవ్ వంటి మాధ్యమాల్లో లైవ్ వీడియోలపై 9 దేశాల్లో నియంత్రణ. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ప్రదర్శించకుండా అడ్డుకోవడం.
ఇంటర్నెట్ ఉన్నా.. స్వేచ్ఛలో వెనుకబాటే!
– ఇంటర్నెట్ అందుబాటు, వేగం విషయంలో భారత్ ర్యాంకు మెరుగుపడింది. కానీ ఇంటర్నెట్ స్వేచ్ఛ విషయంలో మాత్రం భారత్ 41వ స్థానంలో నిలుస్తోంది. పాకిస్తాన్, సౌదీ అట్టడుగున ఉన్నాయి. ఇంటర్నెట్ స్వేచ్ఛలో ఇస్టోనియా, ఐస్‌లాండ్ ప్రథమస్థానంలో.. కెనడా 2వ, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచాయి.
కొన్ని అంశాల్లో మనం మేలే..
అల్ప సంఖ్యాక వర్గాలు, జాతుల సమస్యలు, అవినీతి, ప్రతిపక్షాలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ఎల్‌జీబీటీల సమస్యలకు సంబంధించిన వార్తలపై భారత్‌లో సెన్సార్‌షిప్ లేదని ఫ్రీడం హౌస్ నివేదికలో పేర్కొంది. అయితే ప్రభుత్వాధికారులు, సంస్థలపై విమర్శలు, సామాజిక సంక్షోభాలు, దైవ దూషణ వంటి అంశాలు, వ్యంగ్య రచనలపై నియంత్రణ ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment