ఆయన తీసిన చిత్రాల్లాగే ఆయన జీవితం
వార్సా: ఏ క్షణాన ఏం జరుగుతుందో ఊహకు కూడా అందకుండా ఉత్కంఠతో ముందుకుసాగుతుంది ఆయన తీసిన క్రైమ్, హారర్, స్కాండల్ చిత్రాలు. ఆయన తీసిన చిత్రాల వలే ఆయన నిజజీవితం కూడా అలాగే ముందుకు సాగుతోంది. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే నాజీ మూకలను తప్పించుకు తిరిగాడిన జీవితం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సినీ దర్శకుడిగా మారేందుకు తోడ్పడగా, నిండు గర్భిణితో ఉన్న తన భార్య, ప్రముఖ మోడల్, సినీ తార షరాన్ టేట్ దారుణ హత్య ఆయన్ని నేరం చేసేందుకు ప్రోత్సహించింది.
నాలుగు దశాబ్దాల నుంచి సెక్స్ స్కాండల్ తరుముతుంటే న్యాయం నుంచి తప్పించుకు తిరుగుతూ పొలండ్‌లో తలదాచుకుంటున్న ఆయనకు పోలండ్ సుప్రీంకోర్టు ద్వారా ప్రస్తుతం కాస్త ఊరట లభించింది. ఆయనెవరో ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. 27 సినిమాలకు నామినేషన్ పొంది ఎనిమిది ఆస్కార్ అవార్డులు సాధించిన ప్రఖ్యాత ఫ్రెంచ్ దర్శకుడు రోమన్ పొలాన్‌స్కీ. తన ప్రత్యక్ష అనుభవాలతో నాజీల అకృత్యాలను ఆయనతెరకెక్కించిన ‘ది పియానిస్ట్’ సినిమాకు 2002లో ఆస్కార్ అవార్డు వచ్చింది. పోలండ్ నుంచి వచ్చి పారిస్‌లో స్థిరపడిన యూదు కుటుంబంలో జన్మించిన పొలాన్‌స్కీ ‘మరో సినిమా’ను ప్రేమించే వారికి చిరపరిచితుడు. మాతృదేశమైన పొలండ్‌కు ఆయన కుటుంబం తిరిగొచ్చాక, తల్లిదండ్రులను నాజీ మూకలు అరెస్ట్‌చేసి కాన్‌సెంట్రేషన్ క్యాంప్‌కు తరలించిగా అనధగా మారిన పొలాన్‌స్కీ బాల్యమంతా వీధుల్లోనే గడిచింది.
1962లో ‘నైఫ్ ఇన్ ది వాటర్’ అనే తొలి చిత్రంతో పాశ్చాత్య దేశాల ప్రశంసలు అందుకున్న పొలాన్ స్కీ, వరుసగా ‘రిపల్షన్, ది ఫియర్‌లెస్ వ్యాంపైర్ కిల్లర్స్, రోజ్‌మ్యారీస్ బేబీ లాంటి చిత్రాలను తీశారు. 1969లో నిండు గర్భంతో వున్న ఆయన భార్య, మోడల్, సినీతారైన షరాన్ టేట్‌ను, ఆయన నలుగురు మిత్రులను చార్లెస్ మాన్షన్ అనే కల్ట్ నాయకుడు, ఆయన అనుచరులు అతిదారుణంగా చంపారు. ఆ విషాధం నుంచి తేరుకున్నాక 1974లో అంతర్జాతీయంగా ఖ్యాతి తెచ్చిపెట్టిన ‘చైనా టౌన్’ అనే హాలివుడ్ క్లాసిక్ చిత్రాన్ని నిర్మించారు.
ఇప్పుడు సమంతా గైమర్‌గా చెప్పుకునే అప్పటి గెయిలీ ఫిర్యాదుపై 1977లో అమెరికాలో పోలీసులు పొలాన్‌స్కీని అరెస్ట్ చేశారు. అప్పుడు 13 ఏళ్లున్న గెయిలీని తనను మద్యం తాగించి, డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశారని ఆయనపై కేసు పెట్టారు. మద్యం మత్తులో తప్పు చేశానని ఒప్పుకున్న పొలాన్‌స్కీ క్షమాభిక్ష రాజీ కింద 42 రోజులపాటు జైలుకెళ్లారు. నేరానికి మానసిక చికిత్స కూడా తీసుకున్నారు. 1978లో జైలు నుంచి బయటకు వచ్చిన పొలాన్‌స్కీ తన శిక్ష పూర్తయిందని అనుకున్నారు. అయితే అమెరికా జడ్జీ క్షమాభిక్ష రాజీ ఒప్పందాన్ని రద్దు చేసి భారీ జైలు శిక్షను విధించారు. దాంతో ఆయన ఫ్రాన్స్‌కు పారిపోయారు. ఆయన్ని పరారీలో ఉన్న నేరస్థుడిగా అమెరికా కోర్టు ప్రకటించింది. ఆయన్ని పట్టి అప్పగించాల్సిందిగా అమెరికా దర్యాప్తు సంస్థ పలు దేశాలను కోరింది.
ఈ నేపథ్యంలో 2002లో ఆయన తీసిన ‘ది పియానిస్ట్’ సినిమాకు ఉత్తమ చిత్రంగా అవార్డు లభించినప్పటికీ అమెరికాకు వచ్చి అవార్డును తీసుకోలేక పోయారు. ఆయన పరారీలో ఉన్నప్పటికీ చిత్రాలు తీయడాన్ని మానుకోలేదు. ఓ చిత్ర నిర్మాణం విషయమై స్విడ్జర్లాండ్ వెళ్లినప్పుడు, 2009లో స్థానిక అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పుడే ఆయన అరెస్ట్‌పై అంతర్జాతీయ చర్చ ఊపందుకున్న నేపథ్యంలో 10 నెలల గృహ నిర్బంధం అనంతరం స్విడ్జర్లాండ్ ఆయన్ని విడుదల చేసింది. ఇప్పటికే పరారీలో ఎంతో క్షోభను అనుభవించినందున ఆయనపై దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకుంటానని సమంతా గైమర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ చర్చ జరిగింది. అయితే ఆమెరికా కోర్టు మాత్రం ఇప్పటికీ కేసు ఉపసంహరణకు అంగీకరించలేదు.
పోలండ్‌లో ఉంటున్న పొలాన్‌స్కీని పట్టి అప్పగించాలంటూ అమెరికా ప్రభుత్వం పోలండ్ ప్రభుత్వాన్నీ కోరింది. దీన్ని పొలాన్‌స్కీ స్థానిక హైకోర్టులో సవాల్ చేయగా ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనిపై పొలండ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా ఆ అప్పీల్‌ను మంగళవారం నాడు సుప్రీం కోర్టు కొట్టివేసింది. పేరు ప్రఖ్యాతులతో పాటు అప్రతిష్ట మూటకట్టుకున్నారంటూ ఆయన్ని ఇప్పటికీ పొగిడేవారు, తెగిడే వారు ఉన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పైకొచ్చిన పొలాన్‌స్కీని బాధితురాలే క్షిమించినప్పుడు ఇంకెందుకు శిక్షించాలని పొగిడేవారు వాదిస్తున్నారు. ఈర్శాభావంతో కొంతమంది బాలివుడ్ ప్రముఖులే ఆయనపై కేసును తెగలాగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఓ బాలికను మత్తుపదార్థాలతో రేప్ చేయడం నేరమని, ఆ నేరానికి ఆయనకు శిక్ష పడాల్సిందేనని వ్యతిరేకులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ కేసు ముగింపు అమెరికా కోర్టులోనే తేలుతుందని పొలాన్‌స్కీ న్యాయవాది అంటున్నారు.