పాకెట్ మనీలోనూ వివక్షే..
లండన్ః ఏ దేశంలో అయినా తల్లిదండ్రులు చిన్న పిల్లల ఖర్చులకు పాకెట్ మనీ ఇవ్వడం మామూలే. అయితే ఆ దేశంలో పాకెట్ మనీ విషయంలోనూ అమ్మాయిల పట్ల వివక్ష కనిపిస్తోందట. బ్రిటిష్ పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీపై ఓ బ్యాంకు చేపట్టిన అధ్యయనాల్లో అక్కడ పాకెట్ మనీ విషయంలో ఆడపిల్లలు వెనుకబడ్డట్టు తెలుసుకున్నారు. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల పాకెట్ మనీ 12 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
బ్రిటిష్ పిల్లలు తల్లిదండ్రులనుంచీ సగటున వారానికి 6.55 పౌండ్లు అంటే సుమారు 640 రూపాయలు పాకెట్ మనీగా పొందుతున్నారట. అయితే అందులో ఆడ పిల్లలు 12 శాతం తక్కువ డబ్బును పొందుతున్నట్లు హాలిఫాక్స్ బ్యాంకు ప్రచురించిన అధ్యయనాల్లో తేలింది. ఈ వ్యత్యాసం బ్రిటన్ లో గత సంవత్సర కాలంగా కొనసాగుతోన్నట్లు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. 8 నుంచి 15 ఏళ్ళ వయస్సు లోపల అబ్బాయిలు వారానికి సుమారు 640 రూపాయల వరకూ పాకెట్ మనీ పొందుతుండగా... అదే వయసులోని బాలికలు మాత్రం 597 రూపాయలు మాత్రమే పొందుతున్నారట. అయితే అమ్మాయిలు కూడ తమకు మరింత అధికంగా పాకెట్ మనీ కావాలని కోరుకుంటున్నట్లు తెలుసుకున్నారు. కాగా 1,202 మంది పిల్లలు, 575 మంది తల్లిదండ్రులపై చేపట్టిన సర్వే ప్రకారం లింగ వివక్ష గతేడాది 1.2 శాతం పెరిగినట్లు అధ్యయనాల్లో తెలుసుకున్నారు.
తొమ్మిదేళ్ళకాలంతో పోలిస్తే గతేడాది బ్రిటిష్ పిల్లలు తల్లిదండ్రులనుంచి పొందే పాకెట్ మనీ ఆరు శాతం పెరిగి 640 రూపాయలకు చేరిందట. అలాగే బ్రిటన్ మహిళలు కూడ అక్కడి మగవారితో పోలిస్తే 19.2 శాతం తక్కువ వేతనాలను అందుకుంటున్నట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే 22 నుంచి 29 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలు మగవారికంటే సగటున 1.111 పౌండ్లు ఎక్కువ వేతనాన్నే పొందుతున్నారని, 30 ఏళ్ళ వయసు దాటిన తర్వాత మాత్రం వేతనాల విషయంలో వెనుకబడిపోతున్నారని ఇటీవలి అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఏది ఏమైనా అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఆడపిల్లల పట్ల వివక్ష కనిపిపిస్తోందనేందుకు ఈ తాజా అధ్యయనాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.