మనుషుల్లాగా నడవద్దు.. ఐతే ఏం చేయాలి..!
బెర్లిన్: జర్మనీ వాసులకు డాక్టర్లు ఓ వినూత్న ఐడియాను సూచించారు. ఇకనుంచీ జర్మనీ వాసులు మనుషుల్లాగ నడవద్దని.. పెంగ్విన్స్ తరహాలో నడవాలని డాక్టర్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాగే చేయాలని లేనిపక్షంలో సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ దేశ ప్రజలను హెచ్చరించారు. అసలు విషయం ఏంటంటే.. కొన్ని అమెరికన్ దేశాలతో పాటు యూరప్‌లోనూ కొన్ని నెలలపాటు మంచు కురుస్తుంటుంది. ఈ క్రమంలో మంచుపై నడుస్తున్నప్పుడు పట్టుతప్పి జారి పడిపోయే అవకాశం ఉంది. దీనిపై స్థానిక ఓ వెబ్‌సైట్లో జర్మన్ సొసైటీ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రౌమా సర్జన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో జర్మనీ వాసులు మంచుపై జారిపడి 750 ఎమర్జెన్సీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
రాబోయే శనివారం నాటికి ఉష్ణోగ్రత మైనస్ 10 డిగ్రీలు ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. రెండేళ్ల కింద నెలకొన్ని పరిస్థితులు మరోసారి పునరావృతం కావద్దంటే ప్రజలు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలకు బెర్లిన్ మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ జనాలు ఆరోపించారు. పెంగ్విన్ పక్షుల్లా నడవాలని డాక్టర్లు సూచించారు కానీ, మనుషుల నడకకు, వాటి నడకకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఇది మనకు సాధ్యం కాదని బెర్లిన్ వాసులు అంటున్నారు. పెంగ్విన్లు ఒకేసారి గెంతుతూ వెళ్తాయని, మనం అడుగు తీసి అడుగు వేస్తాం.. ఒక్క కాలు పట్టుతప్పినా జారి పడిపోయే అవకాశం ఎక్కువని వారు వాపోతున్నారు.