దెయ్యం పామును ఎప్పుడైనా చూశారా?
న్యూయార్క్: సాధారణంగా పాములంటేనే భయపడతాం. అలాంటిది దెయ్యం పాము ఎదురుపడితే...? ఇంకేముందీ.. అది కాటేయకముందే ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. ఇంతకీ దెయ్యం పాములు కూడా ఉంటాయా..? ఇదే ప్రశ్న శాస్త్రవేత్తలను అడిగితే.. ఇదిగో ఇక్కడ కనిపించే ఫొటో చూపిస్తూ.. ఇదే దెయ్యం పాము అని చెబుతున్నారు.
ఇప్పటికే వేల రకాల పాములను గుర్తించిన శాస్త్రవేత్తలు ఆఫ్రికాలోని మడగాస్కర్ అడవుల్లోగల అంకారానా నేషనల్ పార్కులో ఈ పామును గుర్తించారట. బూడిద రంగులో ఉండి.. మిగతా పాములతో పోలిస్తే భిన్నమైన చారలతో చూడ్డానికి అతి భయంకరంగా ఉందట. దీని శరీరంపై నిలువు చారలుండడం దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. దీని కణజాలాన్ని సేకరించడంతోపాటు డీఎన్‌ఏ పరీక్షలు చేయగా ఇది ప్రత్యేకమైన జాతికి చెందిన పాము అని, ఇలాంటివి సాయంత్రం, రాత్రి వేళల్లో మాత్రమే సంచరిస్తాయని చెప్పారు. ఈ లక్షణం ఉన్నందునే దీనికి ‘గోస్ట్ స్నేక్’(దెయ్యం పాము) అని పేరు పెట్టామంటున్నారు.