అమెరికాలోనూ అన్నదానాలు.. స్వర్ణదేవాలయమే స్ఫూర్తి!
అమృతసర్లోని స్వర్ణదేవాలయంలో నిర్వహించే 'లంగర్'తో స్ఫూర్తిపొంది.. అమెరికాలోని కొంతమంది విద్యార్థులు ఆన్ ఆర్బర్ ప్రాంతంలోని యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లో అన్నదానాలు నిర్వహిస్తున్నారు. వీళ్లంతా గత వేసవి కాలంలో స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రతిరోజూ 60వేల మందికి కొంతమంది వాలంటీర్లు భోజనాలు పెడతారు. షిఫ్టుల వారీగా డ్యూటీలు వేసుకుని మరీ ఇలా అంతా కలిసి ఈ విధులు నిర్వర్తిస్తారు. దీన్ని చూసి అబ్బురపడిన విద్యార్థులు తమ యూనివర్సిటీలో కూడా ఈ తరహాలోనే అన్నదానం చేయడం మొదలుపెట్టారు.
ప్రతి శుక్రవారం వాళ్లు పదివేల మందికి ముందుగా తయారుచేసిన ఆహారాన్ని ప్యాక్ చేసి ఇస్తున్నారు. అలా తయారుచేసినవాటిలో ఏమైనా మిగిలిపోతే అనాథాశ్రమాలకు పంపుతున్నారు. అమెరికాలో ధనవంతులతో పాటు చాలామంది పేదలు కూడా ఉన్నారని, అందువల్ల అందరూ ఇలా ముందుకు రావాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఈ 'లంగర్' అందరికీ స్ఫూర్తినిస్తుందని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ జస్ప్రీత్సింగ్ తెలిపారు.