
స్టాక్‌హోం: కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి నేపథ్యంలో తాను స్వీయ నిర్బంధంలో ఉన్నానని స్వీడిష్ యువకెరటం, పర్యావరణ వేత్త గ్రెటా థంబర్గ్ తెలిపారు. వాతావరణ మార్పుపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న గ్రెటా.. వివిధ దేశాల్లో పర్యటిస్తారన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల మధ్య యూరప్‌లో పర్యటించారు. ఈ క్రమంలో తనకు కరోనా సోకినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాకుండా తనతో పాటు ప్రయాణించిన తన తండ్రిలో వైరస్ లక్షణాలు వృద్ధి చెందుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. యువతలో కరోనా లక్షణాలు అంత త్వరగా బయటపడవని.. కాబట్టి వారు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించి మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎదుటివారిని ప్రమాదంలో పడేయవద్దని సూచించారు.
(చదవండి: కరోనా వైరస్: ఎందుకంత ప్రమాదకారి?)
ఆ వెసులుబాటు లేదు
‘‘గత రెండు వారాలుగా నేను ఇంట్లోనే ఉన్నాను. మధ్య యూరప్‌లో పర్యటించిన తర్వాత స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను. నాతో పాటు నాన్న కూడా ప్రయాణించారు. మేమిద్దరం అమ్మా, సోదరికి దూరంగా వేరే అపార్టుమెంటు తీసుకుని బస చేస్తున్నాం. పది రోజుల క్రితం నాలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. గొంతు నొప్పి వస్తోంది. జలుబు చేసింది. అయితే నాన్న పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. తీవ్రమైన జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడేంత వరకు స్వయంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటు స్వీడన్‌లో లేదు. చాలా మంది తమకు అనారోగ్యంగా ఉందని చెబుతున్నారు. ఇంట్లోనే ఉంటున్నారు. నేనింత వరకు కరోనా పరీక్ష చేయించుకోలేదు. కానీ నాలో లక్షణాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నేను ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. మీ కారణంగా ఎవరికీ ఇబ్బంది రానీయకండి’’అని గ్రెటా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చింది.
(ఆన్‌లైన్‌లో సరుకులు ఆర్డర్ చేశారా?)
Comments
Please login to add a commentAdd a comment