
మెర్స్ దాడితో కొరియా విలవిల
సియోల్: దక్షిణ కొరియాను వణికిస్తున్న మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) మరింత విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. గతంలో 35 మందికి ఈ వైరస్ సోకినట్లు గుర్తించగా ఆ సంఖ్య ఇప్పటికి 95కు చేరింది. వీరిలో ఏడుగురు మరణించారు. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు లోనవుతున్నారు.
వేగంగా విస్తరిస్తున్న మెర్స్ ను నిరోధించే క్రమంలో అధికారులు 700 స్కూళ్లను మూసివేశారు.స్థానికులు వీలైనంత వరకూ ఇళ్లల్లోనే గడపాలని, ఒక వేళ బహిరంగ ప్రదేశాలకు వస్తే మాస్క్‌లు ధరించాలని సూచించారు. ఓ 68 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియాలో పర్యటించి వచ్చిన తర్వాత అతను వైరస్ బారిన పడ్డాడని అతని వల్ల ఇతరులకు ‘మెర్స్’ వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. ఈ వైరస్ తొలుత సౌదీ అరేబియాలో 2012లో వెలుగుచూసింది. కాగా, గడిచిన మంగళవారం నుంచి ఈ వైరస్ శరవేగంగా విస్తరించడానికి కారణాలు తెలుసుకునే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) బృందం, దక్షిణ కొరియా అధికారులు కలిసి సంయుక్తంగా ఈ ప్రాంతంలో పరిశోధనలు చేయనున్నారు. ఈ పరిశోధన వివరాలను శనివారం నాడు వెల్లడిస్తారు.