
ఆత్మాహుతి దాడులు, ఏకే-47తో కాల్పులు!
ఇస్తాంబుల్: ఉగ్రవాదులు టర్కీలో మరోసారి ఆత్మాహుతి దాడులతో పాటు ఏకే-47తో కాల్పులకు తెగబడ్డారు. ఇస్తాంబుల్ లోని అటాటర్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. బాంబు పేలుళ్లు జరిపిన అనంతరం కొందరు దుండగులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో దాదాపు 28 మంది మృత్యువాత పడగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం టాక్సీల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దుండగులు కాల్పులకు పాల్పడ్డ అనంతరం ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉగ్రవాది ఏకే-47 స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎంట్రీ పాయింట్ల వద్ద అనుమానితులను తనిఖీలు చేపట్టినట్లు స్థానిక మంత్రి బెకిర్ బెజ్డాగ్ వెల్లడించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ప్రవేశ ద్వారం వద్దకు రాగానే ఓ ఉగ్రవాది ఏ.కే47తో కాల్పులు జరిపి ఆ వెంటనే తనను తాను పేల్చుసుకున్నట్లు తమకు సమాచారం అందిందని మంత్రి వివరించారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తులు ఎంతమంది, ఏ ఉగ్రసంస్థకు చెందిన వారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.