పుట్టపర్తి అర్బన్: మద్యానికి బానిసైన తండ్రిని మార్చుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పుట్టపర్తి మండలం వీరాంజనేయపల్లికి చెందిన వడ్డే రాజేష్, రేవతి దంపతులకు ఓ కుమార్తెతో పాటు కుమారుడు విష్ణువర్దన్(19) ఉన్నారు. బేల్దారి పనులతో పాటు వ్యవసాయ కూలి పనులు చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. ప్రస్తుతం విష్ణువర్దన్ అనంతపురంలోని ఓ కళాశాలలో బీకాం రెండో సంవత్సరం చదువుతున్నాడు.
చాలా కాలంగా రాజేష్‌కు మద్యం సేవించడం అలవాటుగా ఉండేది. ఇటీవల అది శ్రుతిమించి మోతాదుకు మించి మద్యం తాగి మత్తులో ఎక్కడపడితే అక్కడే పడిపోయేవాడు. గమనించిన చుట్టుపక్కల వారు రాజేష్ ఆచూకీ తెలపడంతో కుటుంబసభ్యులు వెళ్లి ఇంటికి పిలుచుకువచ్చేవారు. ఈ నేపథ్యంలోనే తెలిసిన వారు పలుమార్లు రాజేష్‌తో మద్యం అలవాటు మాన్పించాలని కుటుంబసభ్యులకు చెబుతూ వచ్చారు. అయితే తమ మాట తండ్రి వినకపోవడం... తరచూ చుట్టుపక్కల వారు హితబోధనలు చేయడం వంటి చర్యలతో సమాజంలో తలెత్తుకుని తిరగలేని స్థితికి చేరుకున్నామని కుటుంబసభ్యులు లోలోన మదనపడేవారు.
ఆదివారం సాయంత్రం అమగొండపాళ్యం రోడ్డు పక్కన మద్యం మత్తులో రాజేష్ పడి ఉన్నాడని తెలుసుకున్న విష్ణువర్దన్ అక్కడకు చేరుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి చేర్చాడు. ఆ సమయంలో తండ్రీకొడుకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేనప్పుడు తాగుడు ఎందుకు అంటూ కుమారుడు నిలదీశాడు. కుమారుడి వాదనలతో తండ్రి ఏకీభవించకుండా తనదైన శైలిలోనే సమాధానమిస్తూ వచ్చాడు. దీంతో ఇక తండ్రిలో మార్పు రాదని గ్రహించిన విష్ణువర్దన్... ఆదివారం రాత్రి ఇటీవల నిర్మించిన ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పాత ఇంటికి చేరుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సోమవారం ఉదయం విష్ణు అవ్వ పాలు పితకడానికి పాత ఇంటి వద్ద ఉన్న పశువుల పాక వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఉరికి విగతజీవిగా వేలాడుతున్న మనవడిని చూసి గట్టిగా కేకలు వేసి అప్రమత్తం చేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించుకుని సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ కృష్ణమూర్తి అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, కుటుంబాన్ని నిలబెడతాడనుకున్న కుమారుడు చనిపోవడంతో కుటుంబసభ్యుల రోదనలకు అంతులేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment