'రెండు తలల పాము గురించి విన్నాం, వార్తల్లో చూశాంగానీ రెండు తలల కుక్కేమిటి?' అంటారా! రెండు తలల కుక్కేకాదు రెండు కాళ్ల పిల్లి, కాళ్లు లేని యువతి, తలలేని మనిషి, పిరమిడ్ లాంటి నిర్మాణం ముందు తెల్లదుస్తుల్లో నిల్చున్న దెయ్యం.. ఇలా చూడటానికి, చదువుకోడానికి ఎన్నో వింతలున్నాయి గూగుల్ లో. ఇదేదో నార్నియా తరహా ఫిక్షనో, మెజీషియన్ల కనికట్టోకాదు. పచ్చి నిజం. 360 డిగ్రీల సత్యం.
గూగుల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్ట్రీట్ వ్యూలో ఇక్కడ చెప్పుకున్న వింతలన్నీ కనిపిస్తాయి. కెమెరాలోపమో, వేగంగా ఫొటోలు తీయడం వలనో తెలియదుగానీ సాధారణ రూపాలే ఇలా వింత ఆకారాలుగా కనిపించాయి. 2014లో స్ట్రీట్ వ్యూ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచి ఏఒక్కరూ పట్టించుకోని ఈ చిత్రాలను న్యూయార్క్ కు చెందిన కెయిల్ మ్యాథ్యూ విలియమ్స్ గుర్తించాడు. స్వతహాగా ఆర్టిస్ట్ అయిన కెయిల్ బాడీ పెంయింటింగ్ లోనూ ఎక్స్ పర్ట్ అట. అందుకే స్ట్రీట్ వ్యూలో ఇలాంటి ఫొటోలను ఠక్కున గుర్తుపట్టి తన ట్టిట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆయన ఎలాంటి బొమ్మలు గీశాడో తెలియదుకానీ గూగుల్ తీసిన బొమ్మల్లో(ఫొటోల్లో)ని తప్పుల్ని కనిపెట్టి ఫేమస్ అయిపోయాడు కెయిల్!