బ్రసెల్స్: కరోనా కాలంలోనూ నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు ఏమిచ్చినా తక్కువే. అలాంటిది ఓ దేశంలో మాత్రం వైద్యులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వ విధానాలతో విసిగి వేసారిన వైద్యులు ప్రధానికి వినూత్న నిరసన తెలిపి షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే బెల్జియం ప్రధాని సోఫీ విల్మ్స్ బ్రస్సెల్స్‌లోని సెయింట్ పీటర్ ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు సహా సిబ్బంది రోడ్డుకిరువైపులా నిల్చుని ఉన్నారు. ఘన స్వాగతం కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. ప్రధాని విల్మ్స్ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రధానికి వీపు చూపిస్తూ నిలబడ్డారు. బడ్జెట్‌లో వీరికి తగినంతగా నిధులు కేటాయించకపోవడం, వేతనాల్లో కోత విధించడంతో ఇప్పటికే అసహనంతో ఊగిపోతున్నారు. (కరోనా విలయం : ఈమె త్యాగం మహోన్నతం)
మరోవైపు ఎలాంటి అర్హతలు లేనివారిని కూడా ప్రభుత్వం నర్సులుగా నియమించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ క్రమంలో తమ వ్యతిరేకతను దేశాధ్యక్షురాలికి తెలియజెప్పేందుకు ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. కొన్నిసార్లు నిశ్శబ్ధ నిరసనే అన్నింటికన్నా ఉత్తమం అని సదరు ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది. "వారి నిరసనలో ఆవేదన కనిపిస్తోంద"ని, "ప్రాణాలకు తెగించి కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్యులకు ప్రభుత్వాలు అండగా ఉండాల"ని పలువురు నెటిజన్లు వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతున్నారు. (కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు)
Comments
Please login to add a commentAdd a comment