కాలుష్యంతో గుండెపోటు!
వాయు కాలుష్యంతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కానీ వాయు కాలుష్యం గుండెపోటు సమస్యకు కూడా కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చారు. 2013లో ప్రపంచవ్యాప్తంగా నమోదైన గుండెపోటు ఘటనల్లో దాదాపు 30 శాతం వాయు కాలుష్యం కారణంగా వచ్చినవేనని లాన్‌సెట్ న్యూరాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనంలో భాగంగా 1990-2013 మధ్య కాలంలో దాదాపు 188 దేశాల్లో సంభవించిన గుండెపోట్లను, 17 రిస్క్ ఫ్యాక్టర్ల పరిధిలో శాస్త్రవేత్తలు విశ్లేషించారు.
ధూమపానం, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వంటివి 74 శాతం గుండెపోట్లకు కారణమని గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు కోటీ యాభై లక్షల మంది గుండెపోటుకు గురవుతుండగా.. అందులో 60 లక్షల మంది మరణిస్తున్నారు, మరో యాభై లక్షల మంది దృష్టి లేదా మాట కోల్పోవడం, పక్షవాతం వంటి శాశ్వత వైకల్యాల బారిన పడుతున్నారు. ఇలా వైకల్యం బారిన పడుతున్న వారిలో 30 శాతం మంది వాయు కాలుష్యం వల్ల ప్రభావితమైన వారిగా అధ్యయనం గుర్తించింది. ఇలా కాలుష్యం ద్వారా వచ్చే గుండెపోటు భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తేల్చింది.
పది ప్రధాన కారణాలు
1. అధిక రక్తపోటు 2. ఆహారంలో పండ్లు తక్కువగా ఉండటం 3. బాడీ మాస్ ఇండెక్స్ అధికంగా ఉండడం 4. సోడియం (ఉప్పు) ఎక్కువ ఉన్న ఆహారం 5. ధూమపానం 6. కాయగూరలు తక్కువగా ఉన్న ఆహారం 7. వాతావరణ వాయు కాలుష్యం 8. కట్టెల్లాంటి ఘన ఇంధనాలను మండించడం ద్వారా ఇళ్లలో ఏర్పడే కాలుష్యం 9. గింజలతో కూడిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం 10. రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం
ప్రాంతాల వారీగా కారణాలు..
అమెరికా, యునెటైడ్ కింగ్‌డమ్: అధిక రక్తపోటు, ఊబకాయం, పండ్లు, కాయగూరలు తక్కువగా తీసుకోవడం, ధూమపానం
భారత్: అధిక రక్తపోటు, ఇంటి లోపల వాయు కాలుష్యం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పండ్లు, కాయగూరలు తక్కువగా తినడం
చైనా: అధిక రక్తపోటు, ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండటం, పండ్లు తక్కువగా తినడం, ధూమపానం, వాయుకాలుష్యం