
కంపాలా: ఉగాండాలో కురిసిన అధిక వర్షాల కారణంగా ఈశాన్య ప్రాంతంలో నది ఉధృతంగా ప్రవహించడంతో కొండచరియలు విరిగిపడి కనీసం 34 మంది మృతి చెందారు. బుడుదా జిల్లాలోని బుకలాసి ప్రాంతంలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. కొండచరియలు విరిగి దిగువనున్న నివాసాలపై పడటంతో శిథిలాలకింద చాలామంది చిక్కుకుపోయారు. బాధితుల్ని కాపాడేందుకు ప్రభుత్వం సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ ఘటనలో కనీసం 34 మంది మృతి చెందారు. ఇంకా ఎంతమంది కన్పించకుండా పోయారో తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌మీడియాలో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన నివాస ప్రాంతాల ఫొటోలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అరటి చెట్ల మధ్య చిక్కుకున్న కొన్ని మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. బాధితులను కాపాడేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెడ్‌క్రాస్ సంస్థ దుప్పట్లు, టార్పాలిన్లు, తాగునీరు, ఆహార పదార్థాలు, మందుల్ని చేరవేసింద’’ని ఉగాండా రెడ్ క్రాస్ అధికార ప్రతినిధి ఐరేన్ నకసిత చెప్పారు. బుడుద జిల్లాలో 2010లో, 2012లో ఇలాగే కొండచరియలు విరిగిపడి కనీసం వందమంది ప్రాణాలు కోల్పోయారు.