ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 157 మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇథియోపియాలోని కెంచో షాచా గోజ్డి జిల్లాలోని గోఫా జోన్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న సహాయక బృందాలు, పోలీసులు శిథిలాల్లో చిక్కుకున్నవారిని వెలికితీస్తుండగా మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ గుమిగూడిన ప్రజలు, సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్నారు. ఇప్పటివరకు 146 మంది మృతదేహాలను వెలికితీసినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
వర్షం నుంచి వచ్చిన బురద కారణంగా సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయని, మృతి చెందిన వారిలో చిన్నారులు, గర్భిణులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతదేహాలను బురదలో నుంచి బయటకు తీస్తున్నామని చెప్పారు. ఒక కొండచరియ తర్వాత మరో కొండచరియ కూడా విరిగిపడటంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని తెలిపారు.
అయితే జులైలో ప్రారంభమయ్యే వర్షాకాలంలో ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణంగా మారింది. ఈ వర్షాకాలం సెప్టెంబర్ మధ్య వరకు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అక్కడి అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment