229కి చేరిన ఇథియోపియా మృతుల సంఖ్య | At least 229 people killed in Ethiopia landslides | Sakshi
Sakshi News home page

229కి చేరిన ఇథియోపియా మృతుల సంఖ్య

Published Wed, Jul 24 2024 7:33 AM | Last Updated on Wed, Jul 24 2024 9:13 AM

At least 229 people killed in Ethiopia landslides

దక్షిణ ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 229కి చేరింది. గోఫా జోన్ ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవహారాల విభాగం విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం మృతులలో148 మంది పురుషులు, 81 మంది మహిళలు ఉన్నారు.

ఇథియోపియా దక్షిణ ప్రాంతీయ రాష్ట్ర ప్రతినిధి అలెమాయేహు బావ్డి మరణాల సంఖ్యను ధృవీకరించారు. రెస్క్యూ  ఆపరేషన్‌ వేగవంతంగా జరుగుతున్నదని తెలిపారు. కాగా బురదమట్టిలో నుంచి ఐదుగురిని సజీవంగా బయటకు తీసుకువచ్చామని, వారికి వైద్య చికిత్స అందిస్తున్నామని ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఈబీసీ) తెలిపింది. మృతులలో అధికంగా స్థానికులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య నిపుణులు వ్యవసాయ నిపుణులు ఉన్నారని పేర్కొంది.

ఘటన జరిగిన ప్రాంతంలో ఇథియోపియన్ రెడ్‌క్రాస్ అసోసియేషన్‌తో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రొఫెషనల్ రెస్క్యూ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో దక్షిణ ఇథియోపియాలోని  గోఫా ప్రాంతంలో ఆదివారం రాత్రి కొండచరియలు విరిగిపడటంతో భారీగా జనం సమాధి అయ్యారు. సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యలు ప్రారంభంకాగా, ఇంతలో మరొక కొండచరియ విరిగిపడటం మరింత విషాదానికి దారితీసింది.  

ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియదని, మృతదేహాలను ఇంకా బయటకు తీస్తున్నామని గోఫా ప్రాంత జాతీయ విపత్తు ప్రతిస్పందన సంస్థ అధిపతి మార్కోస్ మెలేస్ మీడియాకు తెలిపారు.   ఘటనపై స్పందించిన ఇథియోపియా ప్రధాని అభి అమ్మద్‌ మాట్లాడుతూ భారీ ప్రాణనష్టం తనను ఎంతగానో కలచివేసిందని, విపత్తు ప్రభావాన్ని తగ్గించడానికి ఫెడరల్ అధికారులను ఘటన జరిగిన ప్రాంతానికి పంపించినట్లు తెలిపారు. ఇథియోపియా పార్లమెంటేరియన్ కెమల్ హషి మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం అందిస్తున్నామన్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement