ప్రేతాత్మ పునరుజ్జీవం!!
- సామ్రాజ్యవాద సంస్కృతి పునరుద్ధరణకు జపాన్ ప్రయత్నాలు?
- కిండర్గార్టెన్లో శతాబ్ద కాలం నాటి రాజాజ్ఞల బోధనలు
- ‘యుద్ధ నేరస్తుల ఆత్మల’కు ప్రభుత్వం, ఎంపీల నివాళులు
- పాఠ్యాంశాలుగా హిట్లర్ ఆత్మకథ, బాయినెట్లతో పోరాటాలు
- ప్రజల్లో ఆందోళన, అయోమయం.. పొరుగుదేశాల నిరసనలు
మధ్యయుగాల నాటి రాచరిక యుద్ధ భూతానికి జపాన్ మళ్లీ ప్రాణం పోసే ప్రయత్నం చేస్తోందా? జపాన్లో జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. శతాబ్దం కిందట చరిత్ర పుటల్లో చేరిపోయిన రాచరిక సామ్రాజ్యవాద ఆజ్ఞను మళ్లీ కిండర్గార్టెన్ నుంచి వల్లె వేయించడం.. రాచరిక సామ్రాజ్య విస్తరణ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ‘యుద్ధవీరుల ఆత్మల’కు జపాన్ ప్రజాప్రతినిధులు అధికారికంగా నివాళులర్పించడం వంటి పరిణామాలపై.. జపాన్ సామ్రాజ్యవాద బాధితులైన చైనా, దక్షిణకొరియా, థాయ్లాండ్ తదితర పొరుగు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
జపాన్‌లో సైతం వీర దేశభక్తుల్లో ఈ పరిణామాలపై సంతోషం వ్యక్తమవుతోంటే.. ప్రజాస్వామిక వాదుల్లో మాత్రం ఆశ్చర్యాందోళనలు పెరుగుతున్నాయి. పసివారికి నిషిద్ధ రాజాజ్ఞ బోధనలు..: జపాన్లో 19వ శతాబ్దపు ఆరంభంలో రాచరిక ప్రభుత్వం సామ్రాజ్య విస్తరణ కోసం తన సైనిక బలాన్ని పెంపొందించుకోవడానికి దేశ ప్రజలు చక్రవర్తి కోసం ప్రాణాలు బలివ్వడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చే ఒక రాచాజ్ఞ అమలులో ఉండేది.
‘సామ్రాజ్య సింహాసనాన్ని పరిరక్షించడానికి, నిర్వర్తించడానికి, సుసంపన్నం చేయడానికి మిమ్మల్ని మీరు సాహసోపేతంగా రాజ్యానికి అప్పగించాలి’ అని పౌరులకు పిలుపునివ్వడం దాని సారాంశం. ఆ ఆజ్ఞ ఫలితంగా ప్రజలకు వ్యక్తిగత హక్కులు కూడా ఉండేవి కావు. చిన్నప్పటి నుంచే దీనిని నూరిపోయడం వల్ల పిల్లల నుంచి పెద్దల వరకూ ఆ ఆజ్ఞను బట్టీపట్టి చక్రవర్తి పిలుపునిచ్చిందే తడవుగా యుద్ధరంగానికి పరుగులు పెట్టేందుకు తయారుగా ఉండేవారు. 1890లో జారీ చేసిన ఈ రాచరిక ఆజ్ఞ నాటి జపాన్ సమాజంలో సామ్రాజ్యవాద, సైనిక సంస్కృతిని పెంచి పోషించేందుకు దోహదపడిందనే భావనతో.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత ఆ ఆజ్ఞలను నిషేధించారు.
ఆనక రాచరిక ప్రభుత్వం అంతమై రాజు కేవలం ఒక అధికారిక చిహ్నంగా మిగిలిపోయాడు. కానీ.. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియో నాటి రోజులను గుర్తుకు తెచ్చింది. ఒసాకా కిండర్గార్టెన్లో ముక్కుపచ్చలారని పసివారు ఆ రాచాజ్ఞను కఠోరంగా పఠిస్తున్న దృశ్యమది. పాఠశాలల్లో ఆ ఆజ్ఞను బోధించడానికి జపాన్ ప్రభుత్వమే ఆమోదం తెలిపింది. ఇటీవల ప్రధానమంత్రి షింజో అబే సతీమణి అకీ సదరు పాఠశాలను సందర్శించి.. చిన్నారుల ‘దేశభక్తి’కి ముచ్చటపడుతూ పాఠశాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని షింజో, రక్షణమంత్రి టోమోమి ఇనాడా వంటి వారు మితవాద సంప్రదాయ ధోరణులను పునరుద్ధరించేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ పరిణామాలు జరుగుతున్నాయని పలువురు రాజ్యాంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
యుద్ధ నేరస్తుల ఆత్మలకు నివాళి..: మరోవైపు.. జపాన్ సామ్రాజ్య విస్తరణ యుద్ధాల్లో పాల్గొని ప్రాణాలు విడిచిన దేశ సైనికులు, సైనికాధికారుల ‘ఆత్మల ఆలయం’ యసుకుని ప్రార్థనామందిరాన్ని కూడా దేశ పాలకులు, ప్రజాప్రతినిధులు తరచుగా సందర్శించి నివాళులర్పిస్తుండడం కూడా వివాదాస్పదమవుతోంది. ఈ ప్రార్థనా మందిరాన్ని జపాన్ సామ్రాజ్యవాద సైనికతత్వానికి చిహ్నంగా ఆసియా దేశాలు పరిగణిస్తాయి. ఈ మందిరంలో మొత్తం 24,66,532 మంది ‘అమర’ పురుషులు, మహిళలు, చిన్నారుల పేర్లు, వారి మూలాలు, జనన తేదీలు, మరణించిన ప్రదేశాల వివరాలు నమోదై ఉంటాయి.
అందులో 1,068 మందిని యుద్ధ నేరస్తులుగా రెండో ప్రపంచ యుద్ధానంతరం మిత్ర దేశాల ట్రిబ్యునల్ పేర్కొంది. అందులోనూ 14 మంది ఎ-క్లాస్ (ప్రధమ శ్రేణి) నేరస్తులుగా ప్రకటించింది. తాజాగా శుక్రవారం నాడు కేంద్ర మంత్రితో సహా దాదాపు వంద మంది పార్లమెంటు సభ్యులు ఈ ప్రార్థనా మందిరాన్ని సందర్శించి అమరులకు నివాళులర్పించారు. ప్రధాని అబే ఆ పదవి చేపట్టిన తర్వాత ఒక్కసారి మాత్రం స్వయంగా ఈ మందిరాన్ని సందర్శించారు. ఆ తర్వాత నేరుగా రాకున్నా సంప్రదాయ ప్రార్థనలు, నివాళులను క్రమం తప్పకుండా పంపుతూ ఉన్నారు. సామ్రాజ్యవాదంతో యుద్ధ నేరాలకు పాల్పడ్డ వారిని అమరులుగా కీర్తిస్తూ జపాన్ ప్రభుత్వం నిరంతరం కొనియాడుతుండటం.. నాటి నేరాలను సమర్థించుకోవడమేనని చైనా, దక్షిణ కొరియా, థాయ్లాండ్లు మండిపడుతున్నాయి.
పాఠంగా హిట్లర్ ఆత్మకథ..: ఇక జాత్యహంకారంతో సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచాన్ని గడగడలాడించి లక్షలాది మందిని సామూహిక మానవ హనానికి పాల్పడిన నాజీ పాలకుడు హిట్లర్ ఆత్మకథ ‘మైన్ కాంఫ్’ను కూడా జపాన్ తన విద్యా సంస్థల్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. సైనిక విద్యలో భాగమైన తుపాకీ బాయినెట్లతో (కత్తులతో) పోరాట ప్రక్రియను జూనియర్ హైస్కూల్లో ఒక అంశంగా చేర్చింది.
అంతేకాదు.. సామ్రాజ్య విస్తరణ కాలంలో జపాన్ నౌకాదళం తన యుద్ధ నౌకలకు వినియోగించిన పేర్లను.. ఇప్పుడు జపాన్ తన యుద్ధ నౌకలకు పెడుతోంది. గత నెలలో ఒక యుద్ధ నౌక పేరును ‘కాగా’ అని మార్చింది. ‘కాగా’ అనేది జపాన్ సామ్రాజ్య నౌకాదళంలో విమాన వాహక యుద్ధనౌక పేరు. ఈ చర్యలన్నీ షింజో ప్రభుత్వం జపాన్ సామ్రాజ్యవాద సంస్కృతిని, భావజాలాన్ని పునరుద్ధరించేందుకు చేపడుతున్న చర్యలుగా పొరుగు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్