ఎన్‌ఎస్‌ఏల ఆకస్మిక భేటీ
బ్యాంకాక్‌లో భారత్-పాక్ రహస్య సమావేశం
నిర్మాణాత్మక సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించే దిశగా ఊహించని ముందడుగు పడింది. ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు(ఎన్‌ఎస్‌ఏ) ఆదివారం బ్యాంకాక్‌లో ఆకస్మికంగా సమావేశమయ్యారు. ఉగ్రవాదం, జమ్మూకశ్మీర్, ఇతర ద్వైపాక్షిక అంశాలపై నాలుగు గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. చివరి నిమిషం వరకు రహస్యంగా ఉంచిన ఈ భేటీలో నిర్మాణాత్మక సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. భారత ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్, పాక్ ఎన్‌ఎస్‌ఏ నాసిర్ ఖాన్ జంజువా, విదేశాంగ కార్యదర్శి అహ్మద్ చౌధురీలు మంతనాల్లో పాల్గొన్నారు. చర్చలను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించినట్టు తెలుస్తోంది.
ఎన్‌ఎస్‌ఏల భేటీ తర్వాత ఇరు దేశాల సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘పారిస్‌లో జరిగిన ప్రధానుల భేటీని అనుసరించి ఎన్‌ఎస్‌ఏలు, విదేశాంగ కార్యదర్శులు సమావేశ మయ్యారు. శాంతి, సుస్థిర, సుసంపన్న దక్షిణాసియా కోసం ఇరువురు ప్రధానుల దార్శనికత వారికి మార్గదర్శనం చేసింది. శాంతి, భద్రత, ఉగ్రవాదం, జమ్మూకశ్మీర్, నియంత్రణ రేఖ వద్ద సంయమనం తదితర అంశాలపై చర్చించారు. నిర్మాణాత్మక సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు’ అని అందులో పేర్కొన్నారు.
థాయ్‌లాండ్‌లో ఎందుకంటే..
ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగాల్సిన ఎన్‌ఎస్‌ఏల చర్చలకు ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా తటస్థ దేశమైన థాయ్‌లాండ్‌ను వేదిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇరుపక్షాల ప్రతినిధులకు బ్యాంకాక్‌లో భేటీ కావడం సౌకర్యంగా ఉన్నందుకే అక్కడ చర్చలు జరిగినట్లు భారత అధికార వర్గాలు తెలిపాయి. భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ జపాన్ ప్రధాని అబేతో చర్చల కోసం టోక్యోలో ఉండడం, పాక్ విదేశాంగ కార్యదర్శి ప్రయాణంలో ఉండడంతో ఇరుపక్షాలకు సౌకర్యంగా బ్యాంకాక్‌ను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి. పారిస్‌లో ఇటీవలి ప్రధానుల భేటీ అకస్మిక, మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమే కాదని ఎన్‌ఎస్‌ఏ చర్చలు చెబుతున్నాయి. సంప్రదింపులను ముందుకు తీసుకెళ్లాలన్న ఎన్‌ఎస్‌ఏల నిర్ణయం చర్చల పునరుద్ధరణ కోసం వారు రోడ్‌మ్యాప్ ప్రకారం కసరత్తు చేసి ఉంటారడానికి నిదర్శనం.
ఎన్‌ఎస్‌ఏల భేటీ మహాద్రోహం: కాంగ్రెస్
ఎన్‌ఎస్‌ఏలు రహస్యంగా భేటీ కావడం మోదీ ప్రభుత్వం చేసిన మహాద్రోహమని కాంగ్రెస్ మండిపడింది. పాక్ విషయంలో అనుసరిస్తున్న క్రమ రాహిత్యానికి ఇది నిదర్శనమని పార్టీ నేత మనీశ్ తివారీ ఆరోపించారు. ‘ప్రభుత్వం ఎంచుకున్న విధానానికి, బయటికి చెప్పుకున్నదానికి ఇది పూర్తి విరుద్ధం. గతంలో ఎన్‌ఎన్‌ఏల చర్చల రద్దుకు మీదంటే మీదే బాధ్యతని ఇరు దేశాలూ నిందించుకున్నాయి. మోదీ ప్రభుత్వ 18 నెలల చరిత్రను చూస్తే పాక్‌పై దాని విధానం పరిహాసాస్పదంగా ఉందని తేలుతుంది’ అని విలేకర్లతో అన్నారు. ఇరు దేశాల పరస్పర నిందల తర్వాత దేశానికి ఎలాంటి వివరణా ఇవ్వకుండా బ్యాంకాక్‌లో చర్చలు జరిపారని, అవి అంత అవసరం అని అనుకుంటే వివరణ ఇవ్వాల్సి ఉండిందని అన్నారు. చర్చలను బీజేపీ సమర్థించుకుంది. రష్యాలోని ఉఫాలో ప్రధానులు జారీ చేసిన ప్రకటన స్ఫూర్తితోనే అవి జరిగాయని బీజేపీ ప్రతినిధి నళిన్ కోహ్లి అన్నారు. చర్చలను జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు.
ఉఫాలో నాంది...
తాజా ఎన్‌ఎస్‌ఏల చర్చలకు రష్యాలోని ఉఫాలో జూలైలో షాంఘై సహకార సమితి సదస్సు సందర్భంగా జరిగిన మోదీ, నవాజ్‌ల భేటీ నాంది పలికింది. ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించాలని, ముంబై దాడుల కేసు విచారణను వేగవంతం చేయాలని నాటి సమావేశంలో నిర్ణయించడం తెలిసిందే. ఎన్‌ఎస్‌ఏలు, బీఎస్‌ఎఫ్, పాక్‌రేంజర్స్ డెరైక్టర్ జనరళ్ల భేటీలు తదితరాలను నిర్వహించాలని అప్పుడు నిర్ణయించారు. ప్రకటన ప్రకారం సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్‌ఎస్‌ఏల భేటీ పాక్ అడ్డుపుల్ల వేయడంతో సాకారం కాలేదు. చర్చల ఎజెండాలో కశ్మీర్ అంశాన్ని చేర్చాలని, నాటి పాక్ ఎన్‌ఎస్‌ఏ అజీజ్ కశ్మీర్ వేర్పాటువాదులతో ముందస్తుగా భేటీ కావడానికి అనుమతించాలని పాక్ డిమాండ్ చేసింది. వీటిని భారత్ అంగీకరించకపోవడంతో అజీజ్ పర్యటన రద్దు చేసుకున్నారు.
భారత్ లేవనెత్తిన ప్రధాన అంశాలు
► జమాత్ ఉద్ దవా చీఫ్, హఫీజ్ సయీద్ అప్పగింత
► 26/11 ముంబై దాడుల సూత్రధారి జకీర్ రహమాన్ లఖ్వీ అప్పగింత
► 26/11 ముంబై దాడుల విచారణలో పారదర్శకత
► జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అణచివేత
► దావూద్ ఇబ్రహీం అప్పగింత
ఈ చర్చల వెనుక..
► ఘర్షణలు, వివాదాలకంటే సంప్రదింపులే మంచిదని ఇరు దేశాలు భావించాయి.
► ఉగ్రవాదంపై చర్చ భారత్‌కు అవసరం. ప్రపంచ దేశాల ద్వారా భారత్ తెచ్చిన ఒత్తిడికి పాక్ తలొగ్గింది.
► బ్యాంకాక్‌లో చ ర్చిస్తే కశ్మీర్ వేర్పాటువాదులతో తలెత్తే సమస్యను అధిగమించ్చొచ్చన్న భావన.
► క్రియాశీలంగా ఉండే భారత ఉపఖండ మీడియాను దూరంగా ఉంచడానికి.
► వచ్చే వారం సుష్మా స్వరాజ్ చేపట్టే పాక్ పర్యటనకు సన్నాహాలు పూర్తి చేయడం.