ఆర్ణబ్ గోస్వామి (న్యూస్ యాంకర్) రాయని డైరీ
మాధవ్ శింగరాజు
మనుషులు భలేగా ఉంటారు! దావూద్ ఇబ్రహీం అంటే వాళ్లకెప్పుడూ ఒకటే ఇమేజ్ గుర్తుకు వస్తుంది. ఖరీదైన కుషన్ చెయిర్‌లో ఠీవిగా వెనక్కి వాలిపోయి, కాలు మీద కాలు వేసుకుని ఒకలాటి నిర్లక్ష్యపు డాన్ చూపు చూస్తున్న దావూదే వాళ్లకు మైండ్‌లోకి వస్తాడు. అరవై ఏళ్ల దావూద్‌ని, గ్యాంగ్రీన్‌తో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న దావూద్‌ని వాళ్లు ఎప్పటికీ అంగీకరించలేరు!
‘‘లిజన్.. గోస్వామీ! దావూద్ ఇబ్రహీం గ్యాంగ్రీన్‌తో లేవలేకపోతున్నా సరే.. గన్ పట్టుకుని ముంబై వీధులలోకి వచ్చి గ్యాంగ్‌వార్‌లో కనీసం రోజుకు ఇద్దరు ముగ్గురినైనా ధనాధన్‌మని పేల్చిపారేసి భారత ప్రభుత్వం కన్నుగప్పి తిరిగి కరాచీ వెళ్లిపోతుండాలని ఈ మనుషులంతా ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. ప్రైమ్ టైమ్‌లో రోజూ మనం ఆ న్యూస్ ఇవ్వగలగాలి.. వ్యూయర్స్ ఖాళీ లంచ్‌బాక్సులతో ఇంటికి చేరే సమయానికి’’ అన్నారు.. ఉదయం బోర్డు మీటింగులో చైర్‌పర్సన్.
‘‘ఎగ్జాట్లీ మేమ్’’ అన్నారు సమీర్ జైన్, వినీత్ జైన్, రాజ్ జైన్! ఒకరు వైస్ ఛైర్మన్, ఒకరు మేనేజింగ్ డెరైక్టర్, ఒకరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్! ఆలోచిస్తున్నాన్నేను. ‘‘వెల్ గోస్వామీ! వ్యూయర్స్‌లో మీకొక ఇమేజ్ ఉంది. దావూద్ ఇబ్రహీం మాఫియా డాన్ అయితే, ఆర్ణబ్ గోస్వామి మీడియా డాన్. దాన్ని మీరు కంటిన్యూ చేయాల్సింది! కానీ ఏం చేశారు?! మోదీజీని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మెత్తగా, కొత్తగా, కాస్త చెత్తగా కూడా మాట్లాడారు! మీరలా గన్ తీసి జేబులో పెట్టుకుని మాట్లాడ్డం ఈ దేశానికి నచ్చలేదు. ఎందుకలా చేశారు గోస్వామీ.. ది నేషన్ వాంట్స్ టు నో’’ అంటున్నారు బోర్డు మెంబర్లు.. కలగాపులగంగా, పరమ కంగాళీగా.
లగడపాటి లాంటి వాళ్లనైతే ఈపాటికి లేపేసేవాడిని. ‘యు ఆర్ ఎ రకస్ క్రియేటింగ్ రౌడీ ఇన్ పార్లమెంట్ మిస్టర్ రాజగోపాల్. యు షుడ్ బి త్రోన్ అవుటాఫ్ పార్లమెంట్ అండ్ నెవర్ బి అలౌడ్ అగైన్ మిస్టర్ రాజగోపాల్’ అంటూ ఉంటే పాపం ఆయన నోరెత్తలేకపోయారు. బోర్డు రూమ్‌లో ఇవాళ నేను.. నాట్ లెస్ దేన్ ఎ రాజగోపాల్!
‘‘పి.ఎం. ఇంటర్వ్యూ తర్వాత మన టిఆర్‌పీలు పడిపోయాయి మిస్టర్ గోస్వామీ’’ అంటున్నారు మేడమ్. ‘‘గుజరాత్ సియెంగా ఉన్నప్పుడు మోదీని కరణ్ థాపర్ నీళ్లు తాగించినట్లుగా మీరూ ఏదైనా చేస్తారని అంతా ఎదురు చూశారట. ఫోన్‌లు వస్తున్నాయి గోస్వామీ. మోదీ చేత కనీసం ఒక్క గుటకనైనా వేయించలేకపోయారని మీ మీద, మన చానల్ మీద అంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు’’ అంటున్నారు ఎం.డీ.
ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలా, డిబేట్ డిబేట్‌లా ఉండాలి కదా.. అనబోయాను. ‘‘మీరు స్క్రీన్ మీద ఒకలా, స్ట్రీట్ మీద ఒకలా ఉంటే చానల్ డౌన్ అయిపోతుంది గోస్వామీ’’ అన్నారు బోర్డు మెంబర్లు. గాట్ ది పాయింట్. చానల్ వేల్యూ పెరగాలంటే నా వాల్యూమ్ తగ్గకూడదు!