దావూద్ ఆస్తులను నిజంగా జప్తు చేశారా?
దావూద్ ఆస్తులను నిజంగా జప్తు చేశారా?
Published Sat, Jan 7 2017 5:15 PM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM
భారత్ నుంచి తప్పించుకొని పాకిస్తాన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నట్లు భావిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన 15 వేల కోట్ల రూపాయల ఆస్తులను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అక్కడి ప్రభుత్వం జప్తు చేసినట్లు ‘జీ న్యూస్’లో వచ్చిన వార్త ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ‘దౌత్యపరంగా ఇది భారత ప్రధాని నరేంద్రమోదీ సాధించిన ఘన విజయం’ అంటూ భారతీయ జనతా పార్టీ ట్వీట్ కూడా చేసింది.
దీంతో దేశంలోని పలు ఆంగ్ల పత్రికలు, ప్రాంతీయ భాషా పత్రికలు ఆ వార్తను పునర్ ప్రచురించాయి. తొలుత ఈ వార్తను ప్రచురించిన ‘జీ న్యూస్’లో కూడా ఈ విషయం ఎవరూ చెప్పారో లేదు. వార్తకు ‘జీ న్యూస్ బ్యూరో’ అని మాత్రమే ఉంది. వార్త సోర్స్ కనుక్కునేందుకు జీ న్యూస్ బ్యూరోను పలువురు సీనియర్ జర్నలిస్టులు సంప్రదించగా ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేదు. జీ న్యూస్ ఎడిటర్ సుధీర్ చౌదరిని ఓ ఆన్‌లైన్ మీడియా జర్నలిస్టు సంప్రతించగా తాను కారు డ్రైవింగ్‌లో ఉన్నానని, అరగంట తర్వాత చెబుతానని చెప్పారు. ఆయన ఈ విషయమై ఎన్నిసార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినా ఇంతవరకు స్పందించడం లేదు. దావూద్ ఇబ్రహీం ఆస్తుల జప్తు గురించి ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ జర్నలిస్టులు భారత ఇంటెలిజెన్స్, దర్యాప్తు సంస్థలన్నింటినీ సంప్రదించగా అలాంటి సమాచారమేదీ తమవద్ద లేదని వారు సమాధానం ఇచ్చారట.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని మీడియాకు గానీ, అక్కడి ప్రభుత్వానికి గానీ ఏమైనా తెలుసేమో కనుక్కునేందుకు తోటి జర్నలిస్టులు అక్కడి జర్నలిస్టులను సంప్రదించగా, అలాంటి వార్తేదీ అక్కడి పత్రికల్లో రాలేదని, అక్కడి ప్రభుత్వానికి గానీ, విదేశాంగ శాఖకు గానీ, అక్కడి భారత ఎంబసీకి గానీ తెలియదని అక్కడి నుంచి వెలువడుతున్న ఆంగ్ల పత్రిక ‘ఖలీల్ టైమ్స్’కు చెందిన సతీష్ అనే జర్నలిస్ట్ స్పష్టంచేశారు. దావూద్ ఆస్తుల జప్తునకు సంబంధించిన ముఖ్యమైన వార్త అటు అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి గానీ, ఇటు భారత ప్రభుత్వానికి గానీ, అక్కడి భారత ఎండసీకి గానీ తెలియకుండా ఎలా ఉంటుంది? అసలు ఎక్కడినుంచి ఈ వార్త పుట్టింది. ఇందులో అసలు నిజం ఎంతుంది?
ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మను తోటి జర్నలిస్టులు ప్రశ్నించగా, పార్టీలోని సమాచార, సాంకేతిక విభాగం ముందుగా ట్వీట్ చేసిందని, దానికి ఇప్పటికీ తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. మోదీ 2015, ఆగస్ట్ నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను సందర్శించి, అక్కడి ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకున్నారని, ఆయన నాడు నెరపిన దౌత్యం కారణంగా దావూద్ ఆస్తులను అక్కడి ప్రభుత్వం జప్తు చేసిందని, ఇది మోదీ విజయమని వ్యాఖ్యానించారు. ఇంతకు వార్తకు ఆధారం ఏమిటని ప్రశ్నించగా, పార్టీ సమాచార విభాగానికి చాలా మార్గాల నుంచి సమాచారం వస్తుంటుందని, ఏదో మార్గం నుంచి సమాచారం రావడం వల్లనే ట్వీట్ చేశారని చెప్పారు. సోర్స్ మాత్రం చెప్పలేదు.
ఈ వార్తను ప్రచురించిన పలు పత్రికలు తిరిగేసినా ‘ఎకార్డింగ్ టు మీడియా రిపోర్ట్స్’ అని ఉన్నదే తప్ప సోర్స్‌ను ఏ పత్రికా పేర్కొనలేదు. కొన్ని పత్రికలు బీజేపీ ట్వీట్‌ను ఉదహరించాయి. ఏ సోర్స్ లేకుండా ఈ వార్త ఎలా వెలుగులోకి వచ్చింది? పెద్ద నోట్ల రద్దుతో మసకబారిన మోదీ ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకు ఈ వార్తను సృష్టించారా? దావూద్ ఆస్తుల జప్తునకు సంబంధించిన పరిణామ చర్యలపైనే ఈ వార్త ప్రామాణికత ఆధారపడి ఉంటుంది. మున్ముందు ఎలాంటి వార్తలు వస్తాయో చూడాలి.
-ఓ సెక్యులరిస్ట్ కామెంట్
Advertisement
Advertisement