ఐరాస: పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఉగ్రవాద సంస్థలు జమ్మూ కశ్మీర్‌లో భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వేందుకు, అల్లర్లు సృష్టించేందుకు చిన్నారులను ఆయుధాలుగా వాడుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) నివేదికలో వెల్లడించింది. చిన్నారులు, సాయుధ దాడులు అనే అంశంపై ఐరాస వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 2017 జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా అల్లర్ల కారణంగా మరణించిన, గాయాలపాలైన చిన్నారుల సంఖ్య పదివేలకు పైగా ఉంది. అంతేకాకుండా ఉగ్ర సంస్థలు అల్లర్లు సృష్టించడానికి ఎనిమిది వేల మంది బాలలను నియమించుకున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
సిరియా, అఫ్గానిస్తాన్, యెమెన్, భారత్, ఫిలిప్పీన్స్, నైజీరియాలతో పాటు 20 దేశాలకు సంబంధించి ఈ నివేదికను తయారు చేశారు. భారత్‌లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులకు.. భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో చిన్నారులు ఎక్కువగా బలైపోతున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మావోయిస్టులు కూడా చిన్నారులనే ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు ప్రత్యేకంగా చిన్నారులను నియమించుకొని వారిచేత అల్లర్లు చేయిస్తున్నారని, అలాగే పిల్లలను ఇన్‌ఫార్మర్లు, గూఢచారులుగా ఉపయోగించుకుంటున్నారని వెల్లడించారు. పాకిస్తాన్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment