
హ్యూస్టన్: హ్యూస్టన్ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ కోసం ‘నమో థాలి, నమో మిఠాయి థాలి’లతో విందు భోజనం ఎదురుచూస్తోంది. హ్యూస్టన్‌లో కిరణ్స్ అనే రెస్టారెంట్ నడుపుతున్న ఒడిశాకు చెందిన చెఫ్ కిరణ్ వర్మకు హ్యూస్టన్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీకి భోజనం అందించే అవకాశం లభించింది. మోదీకే కాకుండా, హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరవుతున్న భారతీయులకు భారతీయ వంటకాలను బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లను ఆమే అందించనున్నారు. ఈ అవకాశం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘గత 25 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. మాది ఒడిశా. ప్రధాని మోదీకి భోజనం సమకూర్చే అవకాశం రావడం గొప్పగా ఉంది.
ఆయన కోసం ప్రత్యేకంగా నమో థాలి, నమో మిష్టి/మిఠాయి థాలిలను రూపొందించాం. ఈ డిషెస్ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. ఇటీవలి ఆయన పుట్టిన రోజు కోసం వారి అమ్మగారు ఏ వంటలు చేశారో కనుక్కున్నాను. నమో థాలిలో మేథీ తెప్లా, పుదీనా చట్నీతో సమోసా, చింతపండు చట్నీతో కచోరి, పప్పు, కిచిడీ, ఖాండ్వి.. సహా పలు ఇతర వంటకాలు ఉంటాయి. మిఠాయి థాలిలో గాజర్ హల్వా, రస్‌మలాయి, శ్రీఖండ్, గులాబ్ జామూన్, పాయసం.. సహా మరికొన్ని స్వీట్లు ఉంటాయి. వీటిలో ఏ వంటకాలను మోదీ ఆస్వాదించారో ఆయన విందు ఆరగించిన తరువాతే చెప్తాను. ఈ రెండు డిషెస్‌ను మా రెస్టారెంట్లో రెగ్యులర్ డిషెస్‌గా అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment