kiran varma
-
నమో థాలి, నమో మిఠాయి థాలి!
హ్యూస్టన్: హ్యూస్టన్ పర్యటనలో ఉన్న నరేంద్రమోదీ కోసం ‘నమో థాలి, నమో మిఠాయి థాలి’లతో విందు భోజనం ఎదురుచూస్తోంది. హ్యూస్టన్‌లో కిరణ్స్ అనే రెస్టారెంట్ నడుపుతున్న ఒడిశాకు చెందిన చెఫ్ కిరణ్ వర్మకు హ్యూస్టన్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీకి భోజనం అందించే అవకాశం లభించింది. మోదీకే కాకుండా, హౌడీ మోదీ కార్యక్రమానికి హాజరవుతున్న భారతీయులకు భారతీయ వంటకాలను బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లను ఆమే అందించనున్నారు. ఈ అవకాశం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘గత 25 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. మాది ఒడిశా. ప్రధాని మోదీకి భోజనం సమకూర్చే అవకాశం రావడం గొప్పగా ఉంది. ఆయన కోసం ప్రత్యేకంగా నమో థాలి, నమో మిష్టి/మిఠాయి థాలిలను రూపొందించాం. ఈ డిషెస్ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. ఇటీవలి ఆయన పుట్టిన రోజు కోసం వారి అమ్మగారు ఏ వంటలు చేశారో కనుక్కున్నాను. నమో థాలిలో మేథీ తెప్లా, పుదీనా చట్నీతో సమోసా, చింతపండు చట్నీతో కచోరి, పప్పు, కిచిడీ, ఖాండ్వి.. సహా పలు ఇతర వంటకాలు ఉంటాయి. మిఠాయి థాలిలో గాజర్ హల్వా, రస్‌మలాయి, శ్రీఖండ్, గులాబ్ జామూన్, పాయసం.. సహా మరికొన్ని స్వీట్లు ఉంటాయి. వీటిలో ఏ వంటకాలను మోదీ ఆస్వాదించారో ఆయన విందు ఆరగించిన తరువాతే చెప్తాను. ఈ రెండు డిషెస్‌ను మా రెస్టారెంట్లో రెగ్యులర్ డిషెస్గా అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం’అని వివరించారు. -
దేశంకోసం.. రక్తదానం
పంజగుట్ట: ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ యువకుడు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. రక్తదానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడమే కాకుండా రక్తం అవసరం ఉన్నవారికి, రక్తదానం చేసేవారికి అనుసంధానంగా ‘సింప్లీ బ్లడ్’ అనే యాప్, వెబ్సైట్ తయారు చేశాడు. దేశవ్యాప్త యాత్రలో భాగంగా నగరానికి వచ్చిన కిరణ్ శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో తన యాత్ర అనుభవాలు తెలిపారు. 10వ తరగతి వరకు చదువుకున్న కిరణ్ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేశాడు. 2016 డిసెంబర్లో ఉద్యోగం వదిలేసి దేశం కోసం ఏదైనా చేయాలనే లక్ష్యంతో సింప్లీ బ్లడ్ అనే యాప్‌ను రూపొందించి డిల్లీలో రక్తదానంపై పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చాడు. దేశవ్యాప్తంగా కూడా అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 14 జనవరి 2018న దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరాడు. జమ్ము కశ్మీర్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చంఢీఘడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పూర్తిచేసుకుని తెలంగాణలోకి ప్రవేశించాడు. ఇప్పటివరకు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించిన కిరణ్, మూడు వేల కిలోమీటర్లు నడకయాత్ర, ఐదువేలు వివిధ ట్రాన్స్‌పోర్టు ద్వారా ప్రయాణం కొనసాగించాడు. ఈ ప్రయాణంలో 7 లక్షల మందిని కలిసి రక్తదానం ఆవశ్యకత గురించి వివరించినట్లు కిరణ్ తెలిపారు. ముఖ్యంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తన భార్య ఉద్యోగం చేస్తుందని, తన కొడుకు 13 రోజులు ఉన్నప్పుడు తాను ఇంటినుండి బయటకు వచ్చానని కిరణ్ తెలిపారు.జూన్ 14 వరల్డ్ బ్లడ్డొనేషన్డే రోజు వరకు 15 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తిచేస్తానని, ఒకవేళ 15 వేల కిలోమీటర్లు పూర్తి చేయకున్నా ఆ రోజుకు ఢిల్లీకి వెళ్లి అక్కడ పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తనకు ప్రస్తుతం 33 సంవత్సరాలు కాగా 40 సార్లు రక్తదానం చేశానని ఇంకా కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. తన చిన్నతనంలోనే తల్లి కేన్సర్‌తో మరణించిందని అప్పుడే దేశానికి ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నట్లు కిరణ్ తెలిపారు. -
రెండో పెళ్లి తప్పింది.. తొలి పెళ్లి అయ్యింది
తాండూరు (రంగారెడ్డి): భార్య ఉండగానే ఓ ప్రబుద్ధుడు రెండో పెళ్లికి సిద్ధమవటం.. తీరా తాళి కట్టే సమయానికి మొదటి భార్య రావటం.. పెళ్లి ఆగిపోవటం.. ఏం చేయాలో తోచక వేరే వ్యక్తికి వధువునిచ్చి పెళ్లి చేయటం.. చూస్తే ఏదో సినిమా జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేస్తుందిగా.. ఈ పెళ్లి. సరిగ్గా ఓ పెళ్లిలో ఇదే జరిగింది. శుక్రవారం తాండూరు పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. తాండూరు అర్బన్ సీఐ వెంకట్రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ మండలం రాంపల్లికి చెందిన మంజులకు 1989లో వినోద్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. రెండేళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు. తరువాత 2004 సంవత్సరంలో లంగర్‌హౌస్‌కు చెందిన తన మేనమామ కొడుకు గాజర్ల కిరణ్‌వర్మను పెళ్లి చేసుకున్నారు. తరువాత సేల్స్ రి్రపజెంటేట్గా పనిచేసే కిరణ్‌వర్మ, మంజుల ఇద్దరు కొంతకాలం విశాఖపట్నంలో నివసించారు. రెండేళ్ల క్రితం ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చారు. తాజాగా తాండూరు పట్టణానికి చెందిన ఓ అమ్మాయితో తెలిసిన వారి ద్వారా కిరణ్‌వర్మ పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. తనకు ఇదివరకే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టాడు. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు మంచి ముహూర్తం ఉందని, అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని ఒత్తిడి తెచ్చాడు. వరకట్నం కింద రూ.లక్ష నగదు, నాలుగు తులాల బంగారం ఇతర కానుకలు మాట్లాడుకున్నారు. వధువు తరఫున కుటుంబ సభ్యులు స్థానిక దేవాలయంలో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్న సమాచారం తెలుసుకున్న మంజుల గురువారం రాత్రే కీసర పోలీసుస్టేషన్‌కు వెళ్లి వివరాలు తెలిపింది. మంజుల తన తండ్రి రాజేశ్వరరావు, సోదరుడు బాల్‌రాజ్‌లతో కలిసి తాండూరుకు రాత్రి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే మంజుల పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని, ఆధార్‌కార్డు, ఫొటోలు తదితర ఆధారాలు పోలీసులకు చూపించింది. పోలీసులు వధువు తరఫు వారికి జరిగిన విషయం తెలపడంతో మొదట షాక్ తిన్నారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి, కిరణ్‌వర్మను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వరుడి తరఫున వచ్చిన కొందరు దగ్గర బంధువులు మినహా అందరూ అక్కడి నుంచి ఫలాయనం చిత్తగించారు. ఈ మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్టు సీఐ చెప్పారు. అనంతరం రెండో పెళ్లి తప్పిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు. కూతురు పెళ్లి ఆగిపోవద్దని భావించి కొన్ని గంటల వ్యవధిలో గతంలో అనుకున్న బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి జరిపించారు. మంజులను పెళ్లి చేసుకోలేదు: కిరణ్‌వర్మ తన భార్యగా చెప్పుకుంటున్న మంజులను నేను పెళ్లి చేసుకోలేదు. ఆమెతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాను. సేల్స్ రిప్రజంటేటీవ్‌గా పని చేస్తూ విశాఖపట్నంలో ఇద్దరు కలిసి నివసించాం. సుమారు రెండేళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చాం.