రక్తదానంపై అవగాహన కల్పిస్తూ దేశపర్యటన చేస్తున్న కిరణ్
పంజగుట్ట: ఢిల్లీకి చెందిన కిరణ్ వర్మ యువకుడు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. రక్తదానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడమే కాకుండా రక్తం అవసరం ఉన్నవారికి, రక్తదానం చేసేవారికి అనుసంధానంగా ‘సింప్లీ బ్లడ్’ అనే యాప్, వెబ్‌సైట్ తయారు చేశాడు. దేశవ్యాప్త యాత్రలో భాగంగా నగరానికి వచ్చిన కిరణ్ శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో తన యాత్ర అనుభవాలు తెలిపారు. 10వ తరగతి వరకు చదువుకున్న కిరణ్ మార్కెటింగ్‌లో ఉద్యోగం చేశాడు. 2016 డిసెంబర్‌లో ఉద్యోగం వదిలేసి దేశం కోసం ఏదైనా చేయాలనే లక్ష్యంతో సింప్లీ బ్లడ్ అనే యాప్‌ను రూపొందించి డిల్లీలో రక్తదానంపై పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెచ్చాడు. దేశవ్యాప్తంగా కూడా అవగాహన కల్పించాలనే లక్ష్యంతో 14 జనవరి 2018న దేశవ్యాప్త పర్యటనకు బయలుదేరాడు.
జమ్ము కశ్మీర్ , హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చంఢీఘడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పూర్తిచేసుకుని తెలంగాణలోకి ప్రవేశించాడు. ఇప్పటివరకు 8 వేల కిలోమీటర్లు ప్రయాణించిన కిరణ్, మూడు వేల కిలోమీటర్లు నడకయాత్ర, ఐదువేలు వివిధ ట్రాన్స్‌పోర్టు ద్వారా ప్రయాణం కొనసాగించాడు. ఈ ప్రయాణంలో 7 లక్షల మందిని కలిసి రక్తదానం ఆవశ్యకత గురించి వివరించినట్లు కిరణ్ తెలిపారు. ముఖ్యంగా కాలేజీలు, యూనివర్సిటీల్లో అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తన భార్య ఉద్యోగం చేస్తుందని, తన కొడుకు 13 రోజులు ఉన్నప్పుడు తాను ఇంటినుండి బయటకు వచ్చానని కిరణ్ తెలిపారు.జూన్ 14 వరల్డ్ బ్లడ్‌డొనేషన్‌డే రోజు వరకు 15 వేల కిలోమీటర్ల యాత్ర పూర్తిచేస్తానని, ఒకవేళ 15 వేల కిలోమీటర్లు పూర్తి చేయకున్నా ఆ రోజుకు ఢిల్లీకి వెళ్లి అక్కడ పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. తనకు ప్రస్తుతం 33 సంవత్సరాలు కాగా 40 సార్లు రక్తదానం చేశానని ఇంకా కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. తన చిన్నతనంలోనే తల్లి కేన్సర్‌తో మరణించిందని అప్పుడే దేశానికి ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నట్లు కిరణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment