
సూపర్ ఫిష్.. ఇద్దరిని బురిడీ కొట్టించి!
ప్రేగ్: ఇద్దరు జాలర్లు ఎంతో శ్రమించి ఓ పెద్ద చేపను పట్టారు. కానీ వారి ఆనందం కొన్ని క్షణాల్లోనే ఆవిరైంది. చేప దొరికిందని వారు ఆనందించేలోగానే మళ్లీ నీళ్లలోకి జారుకుని బతుకు జీవుడా అంటూ తప్పించుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 3.5లక్షల మంది వీక్షించగా, భారీ సంఖ్యలో కామెంట్లు, లైక్స్‌తో దూసుకుపోతోంది. ఆ వివరాలివి.. చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఇద్దరు మత్స్యకారులు గత జూన్ 27న ఓ తీరంలో చేపల వేటకు వెళ్లారు. కొద్దిసేపు కష్టపడి మరీ ఓ పెద్ద చేపను పట్టేశారు.
గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించిన ఓ వ్యక్తి ఓ రబ్బర్ మ్యాట్‌పై చేపను ఉంచాడు. ఇక అంతే.. చేప పూనకం వచ్చినట్లుగా కదలడం మొదలుపెట్టింది. చేప నీళ్లవైపుగా వెళ్లకుండా అడ్డుకోవాలని మరో వ్యక్తి డైవ్ వేసినా ప్రయోజనం లేకపోయింది. ఆ చేప బతుకు జీవుడా అనుకుంటూ ఏం చక్కా నీళ్లలోకి జారుకుని తప్పించుకుంది. మూడు రోజుల కిందట యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. ఆ జాలర్లుకు కలిసిరాని రోజు అని కొందరు కామెంట్ చేయగా, సూపర్ చేప అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.