బీజింగ్ : ప్రమాదాలనేవి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణగా చైనాలోని గ్జీనింగ్ పట్టణంలో చోటుచేసుకున్న ప్రమాదాన్ని చూస్తే అది నిజమేననిపిస్తుంది.రోడ్డుపై వెళుతున్న ఒక బస్సు బస్టాప్‌లో వచ్చి ఆగింది. ప్రయాణికులు బస్సును ఎక్కుతున్న సమయంలో ఆకస్మాత్తుగా గుంతలో కూరుకుపోయింది. తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలో మంటలు చెలరేగడంతో పాటు బస్సు మొత్తం అందులోకి కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా,10 మంది ఆచూకీ లభించలేదు. కాగా ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సీసీటీవి ఫుటేజీ ఆధారంగా తెలుస్తుంది.
అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియడం లేదు. ప్రమాద సమయంలో ప్రయాణికులు గుంతలో పడిన దృశ్యాలు రికార్డయ్యాయి.దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బలగాలు ఘటనా స్థలికి చేరుకొని ఆపరేషన్ నిర్వహించి బస్సును బయటికి తీశారు. కాగా గుంతలో పడిన వారిలో ఇప్పటివరకు 16 మందిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం చైనాలో కొత్తేం కాదు. ఇంతకుముందు చైనాలోని షెంజెన్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో 10 మీటర్ల మేర భారీ గుంత ఏర్పడి ఐదుగురు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment