సీసీ టీవీ దృశ్యాలు
బీజింగ్ : చైనాలోని గువాంగ్‌జోకు చెందిన ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నాడు. తోటి ప్రయాణికునితో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాగిపోతున్నాడు. ఇంతలో అతని బ్యాగు నుంచి బాంబు పేలినంత శబ్ధం.. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే బ్యాగును కింద పడేసి మంటల నుంచి తనను తాను రక్షించుకున్నాడు. ఆ పేలుడు కారణంగా బస్సు మొత్తం పొగతో నిండిపోయింది. ఎలాగైతేనేం ఆ వ్యక్తి చావు నుంచి తప్పించుకున్నాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కాలిపోయిన బ్యాగు తెరిచి చూస్తే.. అప్పుడర్థమైంది. చార్జింగ్ పెట్టుకోవటానికి తెచ్చుకున్న పవర్‌బ్యాంకు పేలి ప్రాణాల మీదకు వచ్చిందని. ఈ సంఘటన చైనా దేశంలోని గువాంగ్‌జో పట్టణంలో చోటుచేసుకుంది.
ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ ఘటనలో బాధితునితో సహా ప్రయాణికులెవ్వరూ గాయపడలేదు. గతవారం ముంబై నగరంలో స్నేహితులతో కలసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న ఓ వ్యక్తి జేబులోని ఫోన్ పేలింది. ప్రమాదంలో బాధితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆ ఘటన మరువక ముందే ఇలా పవర్‌బ్యాంకు పేలటం ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించే వారిని కొంత అభద్రతా భావానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా సెల్‌ఫోన్‌లు, పవర్‌బ్యాంకులు వంటి స్మార్ట్ పరికరాలను శరీరానికి వీలైనంత దూరంగా ఉంచుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. స్మార్ట్ పరికరాలను ఎక్కువగా ఉపయోగించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment