కాప్టిక్ చర్చిపై దాడికి పాల్పడిన ఇస్లాం మత ఛాందసవాదులు (ఫైల్ ఫొటో)
కైరో : వందల మంది ఇస్లామిక్ మత ఛాందసవాదులు ఈజిప్టులోని ఓ చర్చిలోకి దూసుకెళ్లి ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రైస్తవులపై దాడి చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈజిప్టు రాజధాని కైరో చేరువలో గల గీజాలో గత శుక్రవారం చోటు చేసుకుంది. కాప్టిక్ చర్చిని కూల్చివేయాలంటూ నినాదాలతో అక్కడికి చేరుకున్న ముస్లింలు చర్చిలో ఉన్న పవిత్ర వస్తువులను ధ్వంసం చేశారు.
అప్రమత్తమైన చర్చి భద్రతా సిబ్బంది ఛాందసవాదుల గుంపును చెల్లాచెదురు చేశారు. అనంతరం గాయపడిన క్రైస్తవులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈజిప్టులో ఇస్లాం మత ప్రభావం ఎక్కువ. అక్కడి జనాభాలో క్రైస్తవులు కేవలం 10 శాతం మాత్రమే. క్రైస్తవులు చర్చిలు నిర్మించుకునేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి లేదు.
2016లో చర్చిలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చింది. అయినా కూడా చర్చిల నిర్మాణానికి వచ్చే అర్జీలను అక్కడి అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇస్లాం మత ఛాందసవాదులు ఆందోళనలు చేస్తారనే భయమే ఇందుకు కారణం. దీంతో క్రైస్తవులు ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రార్ధనా మందిరాలను నిర్మించుకుంటున్నారు.
వీటిపై దాడులు చేస్తున్న ఇస్లాం మత ఛాందసవాదులు వాటిని కూల్చేందుకు కూడా యత్నిస్తున్నారు. 2016 డిసెంబర్ నుంచి ఇలా జరిగిన కల్లోలాల్లో 100 మందికి పైగా క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. కాప్టిక్ చర్చిపై దాడులు జరగడం ఇది తొలిసారేమీ కాదు. గతంలో పలుమార్లు ముస్లింలు ఈ చర్చిని కూల్చివేసేందుకు ప్రయత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment