వావ్..‘స్పిక్స్ మకావ్’
మీరు ఎన్నో రకాల రామ చిలకలను చూసి ఉంటారు. కానీ నీలి రంగులో ఉన్న చిలుకను ఎప్పుడైనా చూశారా? లేదు కదూ! నీలి రంగు రామచిలుక దాదాపు 15 ఏళ్ల తరువాత బ్రెజిల్ వాసులకు కనిపించింది. అరుదైన ‘స్పిక్స్ మకావ్’ అనే నీలిరంగు చిలుకలు కనిపించకపోవడంతో ఆ జాతి అంతరించిపోయిందని అక్కడ స్థానికులంతా భావించారు. అయితే బ్రెజిల్‌లోని బహియా స్టేట్‌లో చెట్లపైన ఎగురుతూ అనూహ్యంగా కనిపించిన మకావ్ చిలుకను చూసిన వారంతా ఆనందం వ్యక్తం చేశారు. కొంతమంది స్థానికులు ఆ చిలుకను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బ్రెజిల్‌లో అటవీశాఖ అధికారులు ఇటీవల వేటగాళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇన్నాళ్లు ఈ చిలుకను బంధించి ఉంచిన వేటగాళ్లు చట్టం నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు వదిలేసి ఉంటారని భావిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
పోలీస్.. ప్యారట్..!
నేరస్తులను ఇంత వరకు జాగిలాలు మాత్రమే పట్టిస్తాయని మనకు తెలుసు. కాని తెలియని విషయం ఏమిటంటే చిలుకలు కూడా నేరస్తులను పట్టిస్తాయి. దీనిపై సందేహం రావొచ్చు. కాని ఇది నిజం. ఈ సంఘటన అమెరికాలోని శాండ్ లేక్‌లో జరిగింది. 14 నెలలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన కేసును చిలుక తన పలుకులతో పరిష్కరించింది. మార్లిన్ దురం, గ్లెన్నా దురం శాండ్ లేక్‌కు చెందిన దంపతులు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇద్దరి మధ్య జరిగిన గొడవలో గ్లెన్నా తన భర్త మార్టిన్‌ను క్షణికావేశంలో తుపాకీతో కాల్చిచంపింది. ‘గ్లెన్నా..నన్ను చంపొద్దు’ అని మార్టిన్ వేడుకున్నాడు. వారి మధ్య జరిగిన చివరి సంభాషణను వారు పెంచుకుంటున్న ఆఫ్రికన్ చిలుక పదే పదే పలుకుతోంది. దాని ఆధారంగా పోలీసులు గ్లెన్నానే హత్య చేసిందనే నిర్ధారణకు వచ్చి ఆమెను అరెస్టు చేశారు.