ఆ ఫొటో చూస్తే వెన్నులో వణుకు..!
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన మహిళ బియాంకా డికిన్‌సన్ ఓ ఫొటో చూడాలంటే ఇప్పటికి వణికిపోతోంది. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో భారీ స్పందన వస్తుంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆ ఎఫ్‌బీ పోస్ట్ 11 వేల లైక్స్, 9800 షేర్లు, 7300 కామెంట్లను సొంతం చేసుకుంది. రెండు రోజుల కిందట తన పిల్లలతో సరదాగా బయటకు వెళ్లింది బియాంకా.
తన ఇతర సంతానం ఆ పరిసర ప్రాంతాల్లో సరదాగా ఆడుకుంటుంటే.. నెట్ ఉన్న ప్రాంతంలో రెండేళ్ల కూతురు ఆగింది. దీంతో తన చేతిలో ఉన్న కెమెరాతో చిన్నారిని ఫొటో తీసింది. ఫొటో తీస్తుండగా పక్కనున్న చెట్ల నుంచి గాలికి ఏవో రాలి పడి కదులుతున్నట్లు బియాంకా డికిన్‌సన్ భావించింది. తాను తీసిన ఫొటో చూసిన ఆ తల్లికి కొన్ని సెకన్లలోపే ముచ్చెమటలు పట్టించింది ఆ ఫొటో. మొదట తన కూతురి నవ్వును అద్భుతంగా కెమెరాలో బంధించానని సంబరపడ్డ బియాంకా ఆ ఫొటోలో ఓ ముదురు గోదుమ రంగులో ఉన్న పెద్ద పామును గుర్తించింది.
ఫొటో తీస్తున్నప్పుడు కూతురిపై మనసు పెట్టినందున అది పాము అని గమనించలేకపోయానని, కూతురికి అడుగు దూరంలో భయంకరమైన పాము వెళ్లినా.. ఎలాంటి హాని తలపెట్టలేదని పోస్ట్‌లో పేర్కొంది. రెండు రోజులు గడుస్తున్నా ఇప్పిటికీ ఆ ఫొటో చూస్తే వెన్నులో వణుకు పుడుతుందని ఆ పాప తల్లి బియాంకా డికిన్‌సన్ అంటోంది. గుడ్ ఫొటోగ్రఫీ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా, మరికొందరు మాత్రం థ్యాంక్ గాడ్ అని కామెంట్ చేస్తున్నారు.