కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్, రెహం ఖాన్ విడాకుల విషయంలో ఆయన భార్య, జర్నలిస్టు భార్య రెహం ఖాన్ ఎట్టకేలకు స్పందించారు. తనను వంట ఇంటికి పరిమితం చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని వ్యాఖ్యానించారు. చపాతీలు చేస్కో కానీ, బయటకు రావద్దని తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీలోని పెద్దలు తనను ఆదేశించారన్నారు. రెండు వారాల తర్వాత తొలిసారిగా నోరువిప్పిన ఆమె తాము విడిపోవడానికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని వివాదాస్పద కమెంట్లు చేశారు.
'నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించిన వ్యక్తి ని పెళ్లి చేసుకున్నా....ఇద్దరం ఒంటరిగా ఉన్నాం.. ఇద్దరి కష్టాలు.. భావాలు,లక్ష్యం ఒకటే అని నేను నమ్మాను..కానీ మేం పూర్తిగా ఒకరికొకరం భిన్నమని వ్యాఖ్యానించారు.
ఇమ్రాన్ తో వివాహ జీవితం ఒక స్వర్గంలా ఉంటుందనుకున్నా, కానీ అంతా తారుమారైంది. ఆయనతో రాజకీయాలు తప్ప, ఇంటి విషయాలు కానీ, కనీసం బాలీవుడ్ సినిమాల గురించి కానీ మరే విషయాలే మాట్లాడే అవకాశం ఉండదని వాపోయారు. ఈ విషయంలో తాను ఎంత మధనపడిందీ ఆ భంగవంతుడికి తెలుసని వ్యాఖ్యానించారు.
అసలు ఇమ్రాన్ తో పెళ్లి అయిన దగ్గర్నించి తాను చాలా విధాలుగా నష్టపోయాయనన్నారు. కూతురుతో సహా, ఇస్లామాబాద్ లోని ఇమ్రాన్ నివాసానికి చేరుకున్నప్పటినుంచి అణచివేత మొదలైందని ఆరోపించారు. తన కరీర్ మొత్తం చిక్కుల్లో పడిందనీ, ముఖ్యంగా పెషావర్ లో వీధి బాలల కోసం ప్రతినిధిగా ఎంపికైనప్పటినుంచీ మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కానీ, దీనికి సంబంధించి ఒక్క సమావేశానికి కూడా హాజరు కాలేకపోయానని, తీవ్రమైన అభద్రతా భావం వెంటాడిందన్నారు. భర్త ఇమ్రాన్ తో సత్సంబంధాలు కొనసాగాలనే ఉద్దేశంతోనే చాలా టెలివిజన్ షో లను వదులుకున్నానని చెప్పారు. అయినా తన మీద అసత్య ఆరోపణలతో దాడి చేశారన్నారు.
ఇకముందు పాకిస్తాన్ వీధి బాలల కోసం తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు సినిమాలను నిర్మించే ఆలోచనలో రెహం ఖాన్ ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవాల్సి అవసరం ఉందన్నారు.
ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న ఇమ్రాన్, రెహం ఖాన్ కనీసం ఏడాది తిరగక ముందే విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ విడాకుల విషయంలో అనేక కథనాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.