'రాజీనామా చేసే ప్రసక్తే లేదు'
రియో డి జనీరో: తమ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా నిరసనల వెల్లువ పెరుగుతున్నప్పటికీ అధికారం నుంచి వైదొలిగేది లేదని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ అన్నారు. తన పదవికి రాజీనామా చేసే అంశాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, గద్దె దిగే ప్రసక్తే లేదని ఆమె మరోసారి పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని స్థానికి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలని, ప్రజలు తమను ఎన్నుకున్నప్పుడు తాను ఎందుకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. తమ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు ఏవో కొన్ని నచ్చనంత మాత్రాన రాజీనామా చేయాలని నిరసనలు చేపట్టడం సమంజసమేనా అని అన్నారు. ప్రజల నిర్ణయాన్ని తాను మాత్రమే కాదు.. తర్వాత ఈ పీఠంపై ఎక్కేవారందరూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. తాను అధ్యక్ష పదవి చేపట్టడం ఇది తొలిసారి కాదని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రతిపక్షాలను హెచ్చిరించారు. దేశ ఆర్థిక సమస్యలపై దృష్టిపెట్టడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమని దిల్మా రౌసెఫ్ పేర్కొన్నారు.