బ్రెజిల్ అధ్యక్షురాలు రౌసెఫ్ సస్పెన్షన్
బ్రెసీలియా: లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్ తొలి మహిళా అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ అభిశంసనకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పీఠాన్నుంచి తొలిగించే క్రమంలో విచారణ కోసం ఆమెను గురువారం సెనేట్ సస్పెండ్ చేసింది. 22 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం రౌసెఫ్ సస్పెన్షన్‌ను 55-22 ఓట్లతో సెనెట్ ఆమోదించింది. బడ్జెట్ ఖాతాల చట్టాల ఉల్లంఘనకు సంబంధించి సెనేట్ ఆరు నెలల్లో విచారణ ముగించాల్సి ఉంటుంది. ఆమెను పూర్తిగా ఇంటికి పంపడానికి సెనెట్‌లో మూడింట రెండువంతుల సాధారణ మెజారిటీ అవసరం.
రౌసెఫ్ సస్పెండ్ అయిన కొద్ది గంటల్లోనే ఉపాధ్యక్షుడు, పీఎండీబీ పార్టీకి చెందిన మైఖేల్ టేమర్ తాత్కాలిక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. దీంతో 13 ఏళ్ల సుదీర్ఘ వామపక్ష వర్కర్స్ పార్టీ పాలనకు తెరపడింది. తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టేమర్ కసరత్తు చేస్తున్నారు. అయితే ఇదంతా ఓ కుట్రగా రౌసెఫ్ అభివర్ణించారు.