Dilma Rousseff
-
అసంబద్ధ రాజకీయ క్రీడ
రాజకీయ అవినీతి వెర్రితలలు వేసినప్పుడు రాజకీయాలకు, అవకాశవాదానికి మధ్య ఉండే అస్పష్ట విభజన రేఖ చెరిగిపోయి ప్రజాస్వామ్యం ప్రహసనంగా మారుతుంది. బ్రెజిల్ ప్రజాస్వామ్యం పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. 2014లో రెండో దఫా దేశాధ్యక్ష పదవిని చేపట్టిన దిల్మా రోసెఫ్‌పై అవినీతి, అధికార దుర్వినియోగాల ఆరోపణలపై విచారణ జరుపుతున్నందున సెనేట్ (ఎగువ సభ) ఆమెను మే 12న తాత్కాలికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ (దిగువ సభ) అంతకు ముందే ఆమెను అభిశంసిస్తూ తీర్మానించింది. సెనేట్ ఆరు నెలలలోగా విచారణను పూర్తి చేసి, ఈ అభిశంసనను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చెయ్యాల్సి ఉంటుంది. 2015 మార్చి నుంచి బ్రెజిల్‌ను కుదిపేస్తున్న ‘కార్ వాష్’ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, న్యాయస్థానాల పట్టుదల కారణంగా... తీగలాగితే డొంకంతా బయటపడ్డట్టు అధికార, ప్రతిపక్షా లనే తేడా లేకుండా చాలా మంది రాజకీయ ప్రముఖులపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వరంగ పెట్రో సంస్థ పెట్రోబ్రాస్ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు సైతం ముడుపులు అందించారు. ఈ కుంభకోణంలో ఎలాంటి ఆరోపణలు, కేసులు లేని ఏకైక ప్రముఖ నేత రోసెఫ్. అభిశంసనకు గురై అధ్యక్ష పదవిని కోల్పోనున్నది కూడా ఆమే! రోసెఫ్‌పై ఉన్న ఆరోపణలు అవినీతికి సంబంధిం చిన్నవి కానే కాదు. 2014 ఎన్నికలకు ముందు ఆమె ప్రభుత్వ గణాంకాలను తమ పార్టీకి అనుకూలంగా వక్రీకరించి బడ్జెట్ లోటును తక్కువగా చూపి ఓటర్లను వంచించారనేది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. ప్రభుత్వాలు గణాంకాల గారడీతో ఆర్థిక వృద్ధి కథనాన్ని ఆశావహంగా తీర్చిదిద్దడం మన దేశం సహా పలు ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలలో ఆమోదనీయమైనదిగా చలామణి అవుతూ ఉన్నదే. ఏదేమైనా అభిశంసన కోరాల్సిన తప్పిదమేమీ కాదు. కాకపోతే ఈ కుంభకోణం జరుగుతున్న కాలంలో పెట్రోబ్రాస్ పాలక వర్గంలో సభ్యులుగా ఉండి కూడా ఆమె దీన్ని జరగనిచ్చారని తప్పు పట్టడం సమంజసమే. కానీ ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధిని పొందని ఆమెను గద్దె దించడానికి పార్లమెంటును, రాజ్యాంగాన్ని వాడుకుంటున్న వారంతా కోట్ల కొద్దీ డాలర్ల ముడుపులు అందుకున్న వారు కావడమే వైచిత్రి. రోసెఫ్ అభిశంసన వ్యూహ కర్త దిగువ సభ స్పీకర్ ఎడువార్డో కన్హా. ఆయనకు పెట్రోబ్రాస్ నుంచి 4 కోట్ల డాలర్ల ముడుపులు అందాయని సుప్రీం కోర్టులో కేసులున్నాయి. శిక్ష పడితే 184 ఏళ్లు జైల్లో మగ్గాల్సి వస్తుంది. ఆయన, రోసెఫ్ వర్కర్స్ పార్టీ (పీకే) నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామ్య పక్షమైన డెమోక్రటిక్ మూవ్మెంట్ పార్టీ(పీఎమ్డీబీలో)కి చెందిన వారు. కాగా, రోసెఫ్ సస్పెన్షన్ తదుపరి తాత్కాలిక అధ్యక్షునిగా ప్రభుత్వాన్ని ఏర్పరచిన ఉపాధ్యక్షుడు మైఖేల్ టెమర్ కూడా ఆదే పార్టీ నేత. ఆయనపైనా కార్ వాష్ కేసులున్నాయి. రోసెఫ్‌ను గద్దెదించడం ద్వారా ప్రజల దృష్టిని పెట్రోబ్రాస్‌పై నుంచి మరల్చి, పోలీసు అధికారులను, న్యాయమూర్తులను మార్చి అవినీతి ఆరోపణల నుంచి బయటపడాలనే వ్యూహాన్ని రచించినది ఆయనే. కన్హాతో టెమర్ కుమ్మక్కయ్యారనే వార్తలు దిగువ సభలో ఓటింగ్‌కు ముందే వినవచ్చాయి. అది నిజమేనని ఆయన ఏర్పరచిన తాత్కాలిక ప్రభుత్వ మంత్రివర్గం చెప్పింది. ఏ భావజాలానికి చెందని పీఎమ్డీబీలో టెమర్‌కు వామపక్షం వైపు మొగ్గుగల మధ్యేవాదిగాlపేరుంది. మహిళలకు, నల్లజాతీయులకు, మూలవాసులకు స్థానం లేకుండా చేసి శ్వేతజాతీయులు, పురుషులు మాత్రమే ఉన్న పచ్చి మితవాద మంత్రి వర్గాన్ని ఏర్పరచి ఆయన పరిశీలకులను నిర్ఘాంతపరచారు. రోసెఫ్ అభిశంసనను రాజకీయ కుట్రగా చూస్తున్నవారి అంచనాలు తప్పు కావనడానికి అధారాలు సైతం టెమర్ ప్రభుత్వం ఏర్పడిన పది రోజులకే బయట పడ్డాయి. కార్ వాష్ కేసుల నుంచి తప్పించుకోవడానికి కేసులున్నవారంతా ఒక్కటై రోసెఫ్‌పై అభిశంసన తీర్మానాన్ని గెలిపిస్తే, టెమర్ అధ్యక్షులై ప్రజల దృష్టిని మరల్చి కేసులను నీరుగారుస్తారంటూ ప్రణాళికా శాఖా మంత్రి రొమేరో జుకా జరిపిన సంభాషణ టేపులు బయటçపడ్డాయి. దీంతో ఆయన ‘దీర్ఘకాలిక సెలవు’పై వెళ్లాల్సి వచ్చింది. వారం తిరిగే సరికే మరో మంత్రి ఫెబియానో సెలివేరియా అవే టేపుల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. రోసెఫ్ వ్యతిరేకులకు సెనేట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నదని తెలుస్తోంది. కాబట్టి సెనేట్ ఓటింగ్‌లో రోసెఫ్ అభిశంసనకు ఆమోదం లభించవచ్చు. అయినా బ్రెజిల్ రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం లేదు. కారణం ఇది ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభం. రోసెఫ్ వామపక్ష వర్కర్స్ పార్టీ 2002 నుంచి అధికారంలో ఉంది. ప్రత్యేకించి లూలా హయాంలో సామాజిక అసమానతలు, జాతి వివక్ష గణనీయంగా తగ్గింది. పేదరిక నిర్మూలనలో గొప్ప విజయాలనే సాధించారు. ఆనాటి తీవ్ర ఆర్థిక తిరోగమనం నుంచి వేగంగా వృద్ధి చెందుతున్న ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా బ్రెజిల్‌ను లూలా నిలపగలిగారు. దేశ జనాభాలో దాదాపు సగంగా ఉన్న నల్ల జాతీయులు, మూలవాసులకు సమానత్వాన్ని, హక్కులను కల్పించడంలో లూలా, రోసెఫ్లు ప్రశంసనీయమైన కృషి చేశారు. అయితే అదే సమయంలో ఉన్నత, సంపన్న, కులీన వర్గాలలో ఈ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తి పెరిగింది. 2008 నుంచి మొదలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2012 నుంచి బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపసాగింది. 2014 నుంచి బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ ఏటికేడాది కుచించుకుపోతూ వచ్చింది. వరుసగా ఐదేళ్లుగా ఎగుమతులు క్షీణిస్తున్నాయి. బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికి చేసిన ప్రయ త్నాలు వర్కర్స్ పార్టీకి ప్రధాన మద్దతుదార్లయిన పేద, మధ్య తరగతి ఆదాయ వర్గాలలో అసంతృప్తిని రాజేశాయి. పలు జాతులకు నిలయమైన బ్రెజిల్లో ప్రత్యేకించి నల్ల జాతీయులను సేవకులుగా పరిగణించే కులీన జాత్యహంకార ధోరణులు ఉన్నత వర్గాలలో మొదటి నుంచీ ఉన్నాయి. అవినీతిపరులైన రాజకీయ వేత్తలంతా పార్టీలకు అతీతంగా ఏకమై ప్రజాభిప్రాయాన్ని తలకిందులు చేసే అవకాశవాద రాజకీయ క్రీడకు వేదికగా పార్లమెంటును దిగజార్చడానికి ఈ సార్వత్రిక అసంతృప్తి ఆస్కారమిచ్చింది. రాజకీయ అవినీతి, అవకాశవాదం కలసి ఆడుతున్న ప్రజాస్వామ్య ప్రహసనంలో నష్టపోయేది ప్రజలు కావడమే విషాదం. -
బ్రెజిల్ అధ్యక్షురాలు రౌసెఫ్ సస్పెన్షన్
బ్రెసీలియా: లాటిన్ అమెరికా దేశం బ్రెజిల్ తొలి మహిళా అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ అభిశంసనకు రంగం సిద్ధమైంది. అధ్యక్ష పీఠాన్నుంచి తొలిగించే క్రమంలో విచారణ కోసం ఆమెను గురువారం సెనేట్ సస్పెండ్ చేసింది. 22 గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం రౌసెఫ్ సస్పెన్షన్‌ను 55-22 ఓట్లతో సెనెట్ ఆమోదించింది. బడ్జెట్ ఖాతాల చట్టాల ఉల్లంఘనకు సంబంధించి సెనేట్ ఆరు నెలల్లో విచారణ ముగించాల్సి ఉంటుంది. ఆమెను పూర్తిగా ఇంటికి పంపడానికి సెనెట్‌లో మూడింట రెండువంతుల సాధారణ మెజారిటీ అవసరం. రౌసెఫ్ సస్పెండ్ అయిన కొద్ది గంటల్లోనే ఉపాధ్యక్షుడు, పీఎండీబీ పార్టీకి చెందిన మైఖేల్ టేమర్ తాత్కాలిక అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. దీంతో 13 ఏళ్ల సుదీర్ఘ వామపక్ష వర్కర్స్ పార్టీ పాలనకు తెరపడింది. తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టేమర్ కసరత్తు చేస్తున్నారు. అయితే ఇదంతా ఓ కుట్రగా రౌసెఫ్ అభివర్ణించారు. -
'ఎందుకు రాజీనామా చేయాలి?'
బ్రసీలియా: అవినీతి ఆరోపణలతో దేశ వ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తుతున్నప్పటికీ అధికారం నుంచి తప్పుకునే ఉద్దేశం తనకు లేదని, అసలు తాను ఎందుకు రాజీనామా చేయాలని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని శనివారం స్థానిక మీడియాతో చెప్పారు. రాజీనామా చేయడం అన్న విషయంపై ఎప్పుడూ ఆలోచించలేదని, అధికార పీఠం నుంచి వైదొలగే అవకాశమే లేదని ఆమె మరోసారి స్పష్టంచేశారు. గతేడాది నుంచి ఆమె తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా అధ్యక్షురాలు వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. గతేడాది డిసెంబర్ నుంచి అవిశ్వాస తీర్మానం పెడతామంటూ ప్రతిపక్షాలు తమ దూకుడును పెంచినా ఫలితం కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో రౌసెఫ్ చేతిలో ఓటమి పాలైన సెనెటర్ ఎసియో నెవెస్ ఆమె రాజీనామా కోసం డిమాండ్ చేస్తున్న వారిలో ప్రధానంగా కనిపిస్తున్నారు. రాజీనామా చేయడం అనేది సొంత నిర్ణయమని, రాజీనామా చేయాలంటూ గోల చేస్తున్న వారికి కొన్ని విషయాలు తెలియవు అన్నారు. అసలు తనను పదవి నుంచి తప్పించడానికి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని నిన్న కూడా ఈ విషయంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో విచారించేందుకు రౌసెఫ్ మెంటర్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాను పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నారు. -
'రాజీనామా చేసే ప్రసక్తే లేదు'
రియో డి జనీరో: తమ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా నిరసనల వెల్లువ పెరుగుతున్నప్పటికీ అధికారం నుంచి వైదొలిగేది లేదని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ అన్నారు. తన పదవికి రాజీనామా చేసే అంశాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదని, గద్దె దిగే ప్రసక్తే లేదని ఆమె మరోసారి పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని స్థానికి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానం పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ తన నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని మనం గౌరవించాలని, ప్రజలు తమను ఎన్నుకున్నప్పుడు తాను ఎందుకు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగారు. తమ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు ఏవో కొన్ని నచ్చనంత మాత్రాన రాజీనామా చేయాలని నిరసనలు చేపట్టడం సమంజసమేనా అని అన్నారు. ప్రజల నిర్ణయాన్ని తాను మాత్రమే కాదు.. తర్వాత ఈ పీఠంపై ఎక్కేవారందరూ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. తాను అధ్యక్ష పదవి చేపట్టడం ఇది తొలిసారి కాదని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రతిపక్షాలను హెచ్చిరించారు. దేశ ఆర్థిక సమస్యలపై దృష్టిపెట్టడం తమ ముందున్న తక్షణ కర్తవ్యమని దిల్మా రౌసెఫ్ పేర్కొన్నారు. -
బ్రెజిల్లో మళ్లీ ‘గులాబీ’ ధగధగ!
దశాబ్దన్నర క్రితం లాటిన్ అమెరికా ఖండాన్ని ఊపేసిన ‘గులాబీ విప్లవం’ ప్రభావం ఇంకా తగ్గలేదని బ్రెజిల్ ఎన్నికలు మరోసారి చాటిచెప్పాయి. అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్నట్టు ఆదివారం సాగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ(పీటీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాధ్యక్షురాలు, ఒకనాటి కమ్యూనిస్టు గెరిల్లా దిల్మా రోసెఫ్ స్వల్ప మెజారిటీతోనే అయినా విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఏ పార్టీకీ నిబంధనల ప్రకారం 50 శాతం ఓట్లు లభించకపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రోసెఫ్ 51.6 శాతం ఓట్లు తెచ్చుకుని గెలుపొందగా, ఆమె ప్రత్యర్థి, బ్రెజిల్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ (పీఎస్‌డీబీ) నేత నెవెస్ 48.4 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. బ్రెజిల్ చరిత్రనూ, దాంతో పెనవేసుకున్న వర్కర్స్‌పార్టీ నేపథ్యాన్ని గుర్తుతెచ్చుకుంటే రోసెఫ్ ఇలా స్వల్ప మెజారిటీతో గెలుపొందడం ఆశ్చర్యం కలిగించేదే. బ్రెజిల్ సుదీర్ఘకాలం వలసపాలనలో మగ్గి, అటు తర్వాత మరిన్ని దశాబ్దాలు సైనిక పదఘట్టనలకింద నలిగింది. 1989లో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా అంతకు ముందూ, ఆ తర్వాతా అది అమెరికా కనుసన్నల్లోనే నడిచింది. ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం, అధిక ధరలు ఒకపక్కా... ప్రత్యర్థి రాజకీయ పక్షాల నాయకులను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీసే హంతకముఠాలు మరోపక్కా చెలరేగిపోతున్న దశలో 2002లో వామపక్ష వాది లూలా డి సిల్వా నాయకత్వంలోని వర్కర్స్ పార్టీ అధికారపగ్గాలు చేపట్టింది. మూడు పూటలా తిండి, గౌరవప్రదమైన కనీస వేతనం వాగ్దానాలుగా గద్దెనెక్కిన లూలా వెనువెంటనే అందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. తన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలొచ్చినా ఈ చర్యల కారణంగానే ఆయన నిలదొక్కుకుని 2006 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మూడోసారి ఆ పదవి చేపట్టడం సాధ్యంకాదు గనుక 2010లో ఆ పార్టీ తరఫున రోసెఫ్ పోటీచేసి విజయం సాధించారు. అమెరికా నీడలో, దాని ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందే ఆర్థిక విధానాల స్థానంలో దేశీయ వనరులను సంపూర్ణంగా వినియోగించుకుని ప్రగతి సాధించేలా బ్రెజిల్‌ను తీర్చిదిద్దడంలో వర్కర్స్ పార్టీ ఈ పుష్కరకాలంగా చేసిన కృషి అనితరసాధ్యమైనది. దీని ఫలితాలు అన్నిటా ప్రతిఫలించాయి. 2003-14 మధ్య బ్రెజిల్ దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) సగటున ఏడాదికి 2.5 శాతం చొప్పున పెరిగింది. పింఛన్ల పంపిణీతోసహా పలు సామాజిక సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలుచేసిన కారణంగా పేదరికం గణనీయంగా తగ్గింది. లూలా తొలిసారి గద్దెనెక్కిన నాటికి నిరుద్యోగం 12.3 శాతం ఉంటే ఇప్పుడది 4.9 శాతం. రోజుకు ఒక డాలర్ సంపాదన కూడా అసాధ్యమయ్యే దుర్భర పరిస్థితులు పోయి కనీస వేతనాలు భారీగా పెరిగాయి. ఇళ్లల్లో పనిచేసేవారిని కార్మికులుగా గుర్తించి, వారికి కనీస వేతనాలు, సెలవులు వంటివి అమలు చేసే నిబంధనలు వచ్చాయి. సంపద పంపిణీలో ఇప్పటికీ వ్యత్యాసాలున్నా గతంతో పోలిస్తే అది చాలా మెరుగుపడింది. జనాభాలో 40 శాతం మంది వాటా గతంతో పోలిస్తే రెట్టింపయింది. ఒక్కమాటలో చెప్పాలంటే దివాలా స్థితినుంచి పన్నెండేళ్లలో బయటపడటమేకాక ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అది రూపుదిద్దుకుంది. భద్రతామండలి శాశ్వత సభ్యత్వానికి సైతం ప్రయత్నించింది. ఇవన్నీ నాణేనికి ఒకవైపు. తన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా 2008లో వచ్చిన ఆర్ధిక సంక్షోభంనుంచి ప్రపంచాన్ని కాపాడినా, దాని ఛాయలనుంచి బ్రెజిల్ తప్పించుకోలేకపోయింది. దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినట్టు ఈ ఏడాదే అధికారికంగా ప్రకటించారు. 6.5 శాతం ద్రవ్యోల్బణంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గడ్డు స్థితిని గుర్తించి రోసెఫ్ వడ్డీ రేట్ల పెంపు, ప్రభుత్వ వ్యయం కుదింపువంటి చర్యలనూ ప్రారంభించారు. ఈమధ్యే జరిగిన ప్రపంచ సాకర్ పోటీలు పుండుమీద కారం చల్లాయి. ఆర్థికమాంద్యం ఉందంటున్న సర్కారు ఈ పోటీలు జరపడంలోని ఔచిత్యమేమిటని నిరసనలు వెల్లువెత్తాయి. ఇంత ఆర్భాటంగా నిర్వహించినా జర్మనీపై తమ ఆటగాళ్లు చిత్తుగా ఓడిపోవడం కుర్రకారుకు ఆగ్రహం కలిగించింది. పైగా మరో రెండేళ్లలో అది ఒలింపిక్ క్రీడలకు కూడా సిద్ధమవుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో సాగిన అధ్యక్ష ఎన్నికల్లో మీడియా మొత్తం సోషల్ డెమొక్రాట్లకు వత్తాసుగా నిలబడింది. అమెరికాతో వైరం తెచ్చుకున్న పర్యవసానంగానే ఈ దుస్థితి దాపురించిందని హోరెత్తించింది. అయితే ఆకలిని, నిరుద్యోగాన్ని మాత్రమే మిగిల్చే...అసమ్మతి గొంతు నులిమే పాత వ్యవస్థ జ్ఞాపకాలు ఆ దేశ పౌరుల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. వర్కర్స్ పార్టీ సంక్షేమ పథకాల్లో, అది కల్పించిన ప్రజాస్వామ్య సంప్రదాయంలో ఎదిగివచ్చిన తరానికి, ముఖ్యంగా మధ్యతరగతికి ఇవి పెద్దగా తెలియకపోవచ్చు. అందువల్లే నెవెస్ నేతృత్వంలో సోషల్ డెమొక్రాట్లు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలిగారు. మీడియా చేసిన ప్రచారం మాటెలా ఉన్నా నెవెస్ మాత్రం ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడున్న కష్టాలనుంచి దేశాన్ని గట్టెక్కించడమే తన ధ్యేయమని చెప్పారు. అయితే తమ జీవితాలు ఇంకాస్త మెరుగుపడాలని సామాన్యులు తాపత్రయపడుతున్నా అందుకోసం పాత రోజుల్లోనికి పలాయనం కావడానికి వారు సిద్ధంగా లేరు. కనుకనే మరోసారి సైతం వర్కర్స్ పార్టీనే ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల సందేశమేమిటో రోసెఫ్ కూడా సరిగానే గ్రహించారు. కనుకనే ‘మెరుగైన’ అధ్యక్షురాలిగా పేరు తెచ్చుకునేందుకు ఈసారి కృషిచేస్తానని, అన్నీ సరిచేస్తానని బ్రెజిల్ ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు. రోసెఫ్ గెలుపు తర్వాత మార్కెట్ దిగ్భ్రాంతికి లోనుకావడం, బ్రెజిల్ కరెన్సీ పడిపోవడంవంటి పరిణామాల నేపథ్యంలో ఈ ‘మెరుగుదల’ ఎలా ఉండబోతున్నదో ప్రపంచమంతా గమనిస్తుంది. -
బ్రెజిల్ అధ్యక్ష పగ్గాలు మళ్లీ రౌసెఫ్‌కే
రియోడీ జెనీరో: బ్రెజిల్ అధ్యక్ష పగ్గాలు మరోసారి వామపక్ష మహిళా నేత, వర్కర్స్ పార్టీకి చెందిన దిల్మారౌసెఫ్‌కే దక్కాయి. ‘నువ్వా-నేనా’ అన్నట్లు పోటాపోటీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి ఏసియోనెవెస్‌పై రౌసెఫ్ విజయం సాధించారు. రౌసెఫ్‌కు 51.6 శాతం ఓట్లు లభించగా, ఏసియోనెవెస్ 48.4 శాతం ఓట్లు సాధించారు. బ్రెజిల్లో 2003 నుంచి వర్కర్స్ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఈ కాలంలో అమలు చేసిన సామాజిక, సంక్షేమ కార్యక్రమాల చేయూతతో ఎందరో పేదరికం నుంచి బయటపడ్డారు. అయితే, గత నాలుగేళ్లుగా ఆర్థిక రంగం తిరోగమనం బాటలో నడుస్తున్నా, దేశాన్ని తిరిగి ప్రగతి బాటన పరుగులెట్టిస్తానని నెవెస్ హామీలిచ్చినా... ఓటర్లు వరుసగా నాలుగోసారి వర్కర్స్ పార్టీకే పట్టం కట్టారు. కాగా, బ్రెజిల్ అధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికైన దిల్మారౌసెఫ్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఆమెతో కలసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక రంగ పురోగమనానికి కృషి చేస్తా... బ్రెజిల్ ఆర్థిక రంగాన్ని పురోగమనం వైపు తీసుకెళతానని, అవినీతిపై పోరాడతానని రౌసెఫ్ ప్రకటించారు. విజయం సాధించిన అనంతరం ఆదివారం ఆమె బ్రసీలియాలో మీడియాతో మాట్లాడారు.