దశాబ్దన్నర క్రితం లాటిన్ అమెరికా ఖండాన్ని ఊపేసిన ‘గులాబీ విప్లవం’ ప్రభావం ఇంకా తగ్గలేదని బ్రెజిల్ ఎన్నికలు మరోసారి చాటిచెప్పాయి. అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్నట్టు ఆదివారం సాగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ(పీటీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాధ్యక్షురాలు, ఒకనాటి కమ్యూనిస్టు గెరిల్లా దిల్మా రోసెఫ్ స్వల్ప మెజారిటీతోనే అయినా విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఏ పార్టీకీ నిబంధనల ప్రకారం 50 శాతం ఓట్లు లభించకపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
రోసెఫ్ 51.6 శాతం ఓట్లు తెచ్చుకుని గెలుపొందగా, ఆమె ప్రత్యర్థి, బ్రెజిల్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ (పీఎస్‌డీబీ) నేత నెవెస్ 48.4 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. బ్రెజిల్ చరిత్రనూ, దాంతో పెనవేసుకున్న వర్కర్స్‌పార్టీ నేపథ్యాన్ని గుర్తుతెచ్చుకుంటే రోసెఫ్ ఇలా స్వల్ప మెజారిటీతో గెలుపొందడం ఆశ్చర్యం కలిగించేదే. బ్రెజిల్ సుదీర్ఘకాలం వలసపాలనలో మగ్గి, అటు తర్వాత మరిన్ని దశాబ్దాలు సైనిక పదఘట్టనలకింద నలిగింది. 1989లో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా అంతకు ముందూ, ఆ తర్వాతా అది అమెరికా కనుసన్నల్లోనే నడిచింది.
ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం, అధిక ధరలు ఒకపక్కా... ప్రత్యర్థి రాజకీయ పక్షాల నాయకులను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీసే హంతకముఠాలు మరోపక్కా చెలరేగిపోతున్న దశలో 2002లో వామపక్ష వాది లూలా డి సిల్వా నాయకత్వంలోని వర్కర్స్ పార్టీ అధికారపగ్గాలు చేపట్టింది. మూడు పూటలా తిండి, గౌరవప్రదమైన కనీస వేతనం వాగ్దానాలుగా గద్దెనెక్కిన లూలా వెనువెంటనే అందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. తన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలొచ్చినా ఈ చర్యల కారణంగానే ఆయన నిలదొక్కుకుని 2006 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మూడోసారి ఆ పదవి చేపట్టడం సాధ్యంకాదు గనుక 2010లో ఆ పార్టీ తరఫున రోసెఫ్ పోటీచేసి విజయం సాధించారు.
అమెరికా నీడలో, దాని ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందే ఆర్థిక విధానాల స్థానంలో దేశీయ వనరులను సంపూర్ణంగా వినియోగించుకుని ప్రగతి సాధించేలా బ్రెజిల్‌ను తీర్చిదిద్దడంలో వర్కర్స్ పార్టీ ఈ పుష్కరకాలంగా చేసిన కృషి అనితరసాధ్యమైనది. దీని ఫలితాలు అన్నిటా ప్రతిఫలించాయి. 2003-14 మధ్య బ్రెజిల్ దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) సగటున ఏడాదికి 2.5 శాతం చొప్పున పెరిగింది. పింఛన్ల పంపిణీతోసహా పలు సామాజిక సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలుచేసిన కారణంగా పేదరికం గణనీయంగా తగ్గింది. లూలా తొలిసారి గద్దెనెక్కిన నాటికి నిరుద్యోగం 12.3 శాతం ఉంటే ఇప్పుడది 4.9 శాతం. రోజుకు ఒక డాలర్ సంపాదన కూడా అసాధ్యమయ్యే దుర్భర పరిస్థితులు పోయి కనీస వేతనాలు భారీగా పెరిగాయి.
ఇళ్లల్లో పనిచేసేవారిని కార్మికులుగా గుర్తించి, వారికి కనీస వేతనాలు, సెలవులు వంటివి అమలు చేసే నిబంధనలు వచ్చాయి. సంపద పంపిణీలో ఇప్పటికీ వ్యత్యాసాలున్నా గతంతో పోలిస్తే అది చాలా మెరుగుపడింది. జనాభాలో 40 శాతం మంది వాటా గతంతో పోలిస్తే రెట్టింపయింది. ఒక్కమాటలో చెప్పాలంటే దివాలా స్థితినుంచి పన్నెండేళ్లలో బయటపడటమేకాక ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అది రూపుదిద్దుకుంది. భద్రతామండలి శాశ్వత సభ్యత్వానికి సైతం ప్రయత్నించింది.
ఇవన్నీ నాణేనికి ఒకవైపు. తన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా 2008లో వచ్చిన ఆర్ధిక సంక్షోభంనుంచి ప్రపంచాన్ని కాపాడినా, దాని ఛాయలనుంచి బ్రెజిల్ తప్పించుకోలేకపోయింది. దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినట్టు ఈ ఏడాదే అధికారికంగా ప్రకటించారు. 6.5 శాతం ద్రవ్యోల్బణంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గడ్డు స్థితిని గుర్తించి రోసెఫ్ వడ్డీ రేట్ల పెంపు, ప్రభుత్వ వ్యయం కుదింపువంటి చర్యలనూ ప్రారంభించారు. ఈమధ్యే జరిగిన ప్రపంచ సాకర్ పోటీలు పుండుమీద కారం చల్లాయి. ఆర్థికమాంద్యం ఉందంటున్న సర్కారు ఈ పోటీలు జరపడంలోని ఔచిత్యమేమిటని నిరసనలు వెల్లువెత్తాయి. ఇంత ఆర్భాటంగా నిర్వహించినా జర్మనీపై తమ ఆటగాళ్లు చిత్తుగా ఓడిపోవడం కుర్రకారుకు ఆగ్రహం కలిగించింది. పైగా మరో రెండేళ్లలో అది ఒలింపిక్ క్రీడలకు కూడా సిద్ధమవుతున్నది.
ఈ పరిణామాల నేపథ్యంలో సాగిన అధ్యక్ష ఎన్నికల్లో మీడియా మొత్తం సోషల్ డెమొక్రాట్లకు వత్తాసుగా నిలబడింది. అమెరికాతో వైరం తెచ్చుకున్న పర్యవసానంగానే ఈ దుస్థితి దాపురించిందని హోరెత్తించింది. అయితే ఆకలిని, నిరుద్యోగాన్ని మాత్రమే మిగిల్చే...అసమ్మతి గొంతు నులిమే పాత వ్యవస్థ జ్ఞాపకాలు ఆ దేశ పౌరుల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. వర్కర్స్ పార్టీ సంక్షేమ పథకాల్లో, అది కల్పించిన ప్రజాస్వామ్య సంప్రదాయంలో ఎదిగివచ్చిన తరానికి, ముఖ్యంగా మధ్యతరగతికి ఇవి పెద్దగా తెలియకపోవచ్చు. అందువల్లే నెవెస్ నేతృత్వంలో సోషల్ డెమొక్రాట్లు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలిగారు.
మీడియా చేసిన ప్రచారం మాటెలా ఉన్నా నెవెస్ మాత్రం ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడున్న కష్టాలనుంచి దేశాన్ని గట్టెక్కించడమే తన ధ్యేయమని చెప్పారు. అయితే తమ జీవితాలు ఇంకాస్త మెరుగుపడాలని సామాన్యులు తాపత్రయపడుతున్నా అందుకోసం పాత రోజుల్లోనికి పలాయనం కావడానికి వారు సిద్ధంగా లేరు. కనుకనే మరోసారి సైతం వర్కర్స్ పార్టీనే ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల సందేశమేమిటో రోసెఫ్ కూడా సరిగానే గ్రహించారు. కనుకనే ‘మెరుగైన’ అధ్యక్షురాలిగా పేరు తెచ్చుకునేందుకు ఈసారి కృషిచేస్తానని, అన్నీ సరిచేస్తానని బ్రెజిల్ ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు. రోసెఫ్ గెలుపు తర్వాత మార్కెట్ దిగ్భ్రాంతికి లోనుకావడం, బ్రెజిల్ కరెన్సీ పడిపోవడంవంటి పరిణామాల నేపథ్యంలో ఈ ‘మెరుగుదల’ ఎలా ఉండబోతున్నదో ప్రపంచమంతా గమనిస్తుంది.
బ్రెజిల్‌లో మళ్లీ ‘గులాబీ’ ధగధగ!
Published Wed, Oct 29 2014 12:14 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement