రాజకీయ అవినీతి వెర్రితలలు వేసినప్పుడు రాజకీయాలకు, అవకాశవాదానికి మధ్య ఉండే అస్పష్ట విభజన రేఖ చెరిగిపోయి ప్రజాస్వామ్యం ప్రహసనంగా మారుతుంది. బ్రెజిల్ ప్రజాస్వామ్యం పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. 2014లో రెండో దఫా దేశాధ్యక్ష పదవిని చేపట్టిన దిల్మా రోసెఫ్‌పై అవినీతి, అధికార దుర్వినియోగాల ఆరోపణలపై విచారణ జరుపుతున్నందున సెనేట్ (ఎగువ సభ) ఆమెను మే 12న తాత్కాలికంగా అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ (దిగువ సభ) అంతకు ముందే ఆమెను అభిశంసిస్తూ తీర్మానించింది. సెనేట్ ఆరు నెలలలోగా విచారణను పూర్తి చేసి, ఈ అభిశంసనను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చెయ్యాల్సి ఉంటుంది. 2015 మార్చి నుంచి బ్రెజిల్‌ను కుదిపేస్తున్న ‘కార్ వాష్’ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు, న్యాయస్థానాల పట్టుదల కారణంగా... తీగలాగితే డొంకంతా బయటపడ్డట్టు అధికార, ప్రతిపక్షా లనే తేడా లేకుండా చాలా మంది రాజకీయ ప్రముఖులపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వరంగ పెట్రో సంస్థ పెట్రోబ్రాస్ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై భారీ కుంభకోణానికి పాల్పడ్డారు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు సైతం ముడుపులు అందించారు. ఈ కుంభకోణంలో ఎలాంటి ఆరోపణలు, కేసులు లేని ఏకైక ప్రముఖ నేత రోసెఫ్. అభిశంసనకు గురై అధ్యక్ష పదవిని కోల్పోనున్నది కూడా ఆమే! రోసెఫ్‌పై ఉన్న ఆరోపణలు అవినీతికి సంబంధిం చిన్నవి కానే కాదు. 2014 ఎన్నికలకు ముందు ఆమె ప్రభుత్వ గణాంకాలను తమ పార్టీకి అనుకూలంగా వక్రీకరించి బడ్జెట్ లోటును తక్కువగా చూపి ఓటర్లను వంచించారనేది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. ప్రభుత్వాలు గణాంకాల గారడీతో ఆర్థిక వృద్ధి కథనాన్ని ఆశావహంగా తీర్చిదిద్దడం మన దేశం సహా పలు ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలలో ఆమోదనీయమైనదిగా చలామణి అవుతూ ఉన్నదే. ఏదేమైనా అభిశంసన కోరాల్సిన తప్పిదమేమీ కాదు. కాకపోతే ఈ కుంభకోణం జరుగుతున్న కాలంలో పెట్రోబ్రాస్ పాలక వర్గంలో సభ్యులుగా ఉండి కూడా ఆమె దీన్ని జరగనిచ్చారని తప్పు పట్టడం సమంజసమే. కానీ ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధిని పొందని ఆమెను గద్దె దించడానికి పార్లమెంటును, రాజ్యాంగాన్ని వాడుకుంటున్న వారంతా కోట్ల కొద్దీ డాలర్ల ముడుపులు అందుకున్న వారు కావడమే వైచిత్రి.
రోసెఫ్ అభిశంసన వ్యూహ కర్త దిగువ సభ స్పీకర్ ఎడువార్డో కన్హా. ఆయనకు పెట్రోబ్రాస్ నుంచి 4 కోట్ల డాలర్ల ముడుపులు అందాయని సుప్రీం కోర్టులో కేసులున్నాయి. శిక్ష పడితే 184 ఏళ్లు జైల్లో మగ్గాల్సి వస్తుంది. ఆయన, రోసెఫ్ వర్కర్స్ పార్టీ (పీకే) నేతృత్వంలోని అధికార కూటమిలో భాగస్వామ్య పక్షమైన డెమోక్రటిక్ మూవ్‌మెంట్ పార్టీ(పీఎమ్‌డీబీలో)కి చెందిన వారు. కాగా, రోసెఫ్ సస్పెన్షన్ తదుపరి తాత్కాలిక అధ్యక్షునిగా ప్రభుత్వాన్ని ఏర్పరచిన ఉపాధ్యక్షుడు మైఖేల్ టెమర్ కూడా ఆదే పార్టీ నేత. ఆయనపైనా కార్ వాష్ కేసులున్నాయి. రోసెఫ్‌ను గద్దెదించడం ద్వారా ప్రజల దృష్టిని పెట్రోబ్రాస్‌పై నుంచి మరల్చి, పోలీసు అధికారులను, న్యాయమూర్తులను మార్చి అవినీతి ఆరోపణల నుంచి బయటపడాలనే వ్యూహాన్ని రచించినది ఆయనే. కన్హాతో టెమర్ కుమ్మక్కయ్యారనే వార్తలు దిగువ సభలో ఓటింగ్‌కు ముందే వినవచ్చాయి. అది నిజమేనని ఆయన ఏర్పరచిన తాత్కాలిక ప్రభుత్వ మంత్రివర్గం చెప్పింది. ఏ భావజాలానికి చెందని పీఎమ్‌డీబీలో టెమర్‌కు వామపక్షం వైపు మొగ్గుగల మధ్యేవాదిగాlపేరుంది. మహిళలకు, నల్లజాతీయులకు, మూలవాసులకు స్థానం లేకుండా చేసి శ్వేతజాతీయులు, పురుషులు మాత్రమే ఉన్న పచ్చి మితవాద మంత్రి వర్గాన్ని ఏర్పరచి ఆయన పరిశీలకులను నిర్ఘాంతపరచారు.
రోసెఫ్ అభిశంసనను రాజకీయ కుట్రగా చూస్తున్నవారి అంచనాలు తప్పు కావనడానికి అధారాలు సైతం టెమర్ ప్రభుత్వం ఏర్పడిన పది రోజులకే బయట పడ్డాయి. కార్ వాష్ కేసుల నుంచి తప్పించుకోవడానికి కేసులున్నవారంతా ఒక్కటై రోసెఫ్‌పై అభిశంసన తీర్మానాన్ని గెలిపిస్తే, టెమర్ అధ్యక్షులై ప్రజల దృష్టిని మరల్చి కేసులను నీరుగారుస్తారంటూ ప్రణాళికా శాఖా మంత్రి రొమేరో జుకా జరిపిన సంభాషణ టేపులు బయటçపడ్డాయి. దీంతో ఆయన ‘దీర్ఘకాలిక సెలవు’పై వెళ్లాల్సి వచ్చింది. వారం తిరిగే సరికే మరో మంత్రి ఫెబియానో సెలివేరియా అవే టేపుల కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. రోసెఫ్ వ్యతిరేకులకు సెనేట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నదని తెలుస్తోంది. కాబట్టి సెనేట్ ఓటింగ్‌లో రోసెఫ్ అభిశంసనకు ఆమోదం లభించవచ్చు. అయినా బ్రెజిల్ రాజకీయ సంక్షోభానికి తెరపడే అవకాశం లేదు. కారణం ఇది ఆర్థిక, సామాజిక, రాజకీయ సంక్షోభం. రోసెఫ్ వామపక్ష వర్కర్స్ పార్టీ 2002 నుంచి అధికారంలో ఉంది. ప్రత్యేకించి లూలా హయాంలో సామాజిక అసమానతలు, జాతి వివక్ష గణనీయంగా తగ్గింది. పేదరిక నిర్మూలనలో గొప్ప విజయాలనే సాధించారు.
ఆనాటి తీవ్ర ఆర్థిక తిరోగమనం నుంచి వేగంగా వృద్ధి చెందుతున్న ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా బ్రెజిల్‌ను లూలా నిలపగలిగారు. దేశ జనాభాలో దాదాపు సగంగా ఉన్న నల్ల జాతీయులు, మూలవాసులకు సమానత్వాన్ని, హక్కులను కల్పించడంలో లూలా, రోసెఫ్‌లు ప్రశంసనీయమైన కృషి చేశారు. అయితే అదే సమయంలో ఉన్నత, సంపన్న, కులీన వర్గాలలో ఈ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తి పెరిగింది. 2008 నుంచి మొదలైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2012 నుంచి బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపసాగింది. 2014 నుంచి బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ ఏటికేడాది కుచించుకుపోతూ వచ్చింది. వరుసగా ఐదేళ్లుగా ఎగుమతులు క్షీణిస్తున్నాయి. బడ్జెట్ లోటును తగ్గించుకోవడానికి చేసిన ప్రయ త్నాలు వర్కర్స్ పార్టీకి ప్రధాన మద్దతుదార్లయిన పేద, మధ్య తరగతి ఆదాయ వర్గాలలో అసంతృప్తిని రాజేశాయి. పలు జాతులకు నిలయమైన బ్రెజిల్‌లో ప్రత్యేకించి నల్ల జాతీయులను సేవకులుగా పరిగణించే కులీన జాత్యహంకార ధోరణులు ఉన్నత వర్గాలలో మొదటి నుంచీ ఉన్నాయి. అవినీతిపరులైన రాజకీయ వేత్తలంతా పార్టీలకు అతీతంగా ఏకమై ప్రజాభిప్రాయాన్ని తలకిందులు చేసే అవకాశవాద రాజకీయ క్రీడకు వేదికగా పార్లమెంటును దిగజార్చడానికి ఈ సార్వత్రిక అసంతృప్తి ఆస్కారమిచ్చింది. రాజకీయ అవినీతి, అవకాశవాదం కలసి ఆడుతున్న ప్రజాస్వామ్య ప్రహసనంలో నష్టపోయేది ప్రజలు కావడమే విషాదం.
అసంబద్ధ రాజకీయ క్రీడ
Published Fri, Jun 3 2016 12:19 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement