బ్రసీలియా: అవినీతి ఆరోపణలతో దేశ వ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తుతున్నప్పటికీ అధికారం నుంచి తప్పుకునే ఉద్దేశం తనకు లేదని, అసలు తాను ఎందుకు రాజీనామా చేయాలని బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని శనివారం స్థానిక మీడియాతో చెప్పారు. రాజీనామా చేయడం అన్న విషయంపై ఎప్పుడూ ఆలోచించలేదని, అధికార పీఠం నుంచి వైదొలగే అవకాశమే లేదని ఆమె మరోసారి స్పష్టంచేశారు. గతేడాది నుంచి ఆమె తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నా అధ్యక్షురాలు వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. గతేడాది డిసెంబర్ నుంచి అవిశ్వాస తీర్మానం పెడతామంటూ ప్రతిపక్షాలు తమ దూకుడును పెంచినా ఫలితం కనిపించడం లేదు.
2014 ఎన్నికల్లో రౌసెఫ్ చేతిలో ఓటమి పాలైన సెనెటర్ ఎసియో నెవెస్ ఆమె రాజీనామా కోసం డిమాండ్ చేస్తున్న వారిలో ప్రధానంగా కనిపిస్తున్నారు. రాజీనామా చేయడం అనేది సొంత నిర్ణయమని, రాజీనామా చేయాలంటూ గోల చేస్తున్న వారికి కొన్ని విషయాలు తెలియవు అన్నారు. అసలు తనను పదవి నుంచి తప్పించడానికి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవని నిన్న కూడా ఈ విషయంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో విచారించేందుకు రౌసెఫ్ మెంటర్, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాను పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నారు.