
'మై డియర్ ట్రంప్.. ఐ లవ్ యూ'
తమ దేశంలోకి ముస్లింలను అడుగుపెట్టనీయకూడదని సంచలన వ్యాఖ్యలు చేసి ముస్లింల ఆగ్రహాన్ని మూటగట్టుకున్న అమెరికన్ ప్రెసిండెంట్ రేసులోని డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తొలిసారి ఓ ముస్లిం ప్రేమను చూరగొన్నాడు.
న్యూయార్క్: తమ దేశంలోకి ముస్లింలను అడుగుపెట్టనీయకూడదని సంచలన వ్యాఖ్యలు చేసి ముస్లింల ఆగ్రహాన్ని మూటగట్టుకున్న అమెరికన్ ప్రెసిండెంట్ రేసులోని డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తొలిసారి ఓ ముస్లిం ప్రేమను చూరగొన్నాడు. తనకు ట్రంప్ ప్రకటన అమితంగా నచ్చిందని అన్నారు. అమెరికా పౌరులు ఏ అంశాన్ని గురించి భయపడుతున్నారో అదే విషయాన్ని ట్రంప్ ఎలాంటి నిర్మోహమాటం లేకుండా చెప్పారని అన్నారు. ఆయన ట్రంప్ ను కొనియాడుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు.
అందులో 'నేనొక ముస్లింను.. ఐ లవ్యూ ట్రంప్' అంటూ వ్యాఖ్యానించారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ కరోలినా ప్రాంతంలో స్థిరపడిన మెహామీ ఇబ్రహీం(62) అనే వ్యక్తి 1981 అమెరికాకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. ఇతడికి పెద్దగా ముస్లింల వ్యవహారాలు నచ్చవు. పైగా అతడు ఇతర ముస్లింలను ఎక్కువగా గౌరవించడు. అంతే కాకుండా ఈజిప్టులో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న ముస్లింలు ఏ విధంగా తీవ్ర మతభావజాలంలోకి ఇరుక్కుపోతున్నారో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
అదే సమయంలో అమెరికా తనిఖీ సిబ్బందికి అనుమానం వస్తే ముస్లింలను అమెరికాలో అడుగుపెట్టనీయకుండా చేయాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాను ఆమోదిస్తానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఉగ్రవాద సమస్య అయితే ప్రభావాన్ని చూపిస్తుందో అదే అంశాన్ని ట్రంప్ గుర్తించి చక్కగా తన వాక్పటిమతో చెప్పారని అన్నారు.
అమెరికాలోకి తనను రావడాన్ని అడ్డుకున్నా సంతోషపడతానని, తనకు విశ్వాస పరీక్ష పెడితే దానికి ముందు సంతకం తానే పెడతానని అన్నారు. ప్రస్తుతం అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగుతున్న ఈయన ఈజిప్టులో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు గడ్డు సమస్యలు ఎదుర్కొన్నాడు. జైలుకు కూడా వెళ్లొచ్చాడు. ఇటీవలె ట్రంప్ సౌత్ కరోలినా గెలుపొందిన విషయం తెలిసిందే.