ఏంటయ్యా ఇమ్రాన్‌ నీ సమస్య..? | Imran Khan Comment On Indian Internal Issues | Sakshi
Sakshi News home page

భారత అంతర్గత వ్యవహారాలపై ఇమ్రాన్‌ ఆరోపణలు

Published Mon, Aug 19 2019 10:58 AM | Last Updated on Mon, Aug 19 2019 4:04 PM

Imran Khan Comment On Indian Internal Issues - Sakshi

ఇస్లామాబాద్‌: జమ్మూ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా చూపడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమైన పాకిస్తాన్‌ మరో కొత్త వాదనకు కాలుదువ్వుతోంది. కశ్మీర్‌ అంశంపై ఇక తమ వాదనలు చెల్లవని భావించిన ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత అంతర్గత, పరిపాలన వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేశారు. భారత్‌ విషయాల్లో కనీస అవగాహన లేకుండా మరోసారి నోరుపారేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూపొందించిన ఎన్‌ఆర్‌సీ, అణ్వస్త్ర విధానంపై ఇమ్రాన్‌ కొత్త వాదనకు తెరలేపారు. భారత్‌లోని అణ్వస్త్రాల భద్రతను శంకించిన ఆయన.. అంతర్జాతీయ సమాజం కలగజేసుకోవాలని అన్నారు. మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో పాటు సరిహద్దు దేశాలకు ముప్పు కలగజేస్తోందని నిరాధార ఆరోపణలు చేశారు.

రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలు..
ఎన్ఆర్‌సీతో కొన్ని వర్గాలకు నష్టం కలిగే అవకాశం ఉందంటూ దానిపై ఎలాంటి అవగాహన లేకుండానే వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. ఇటీవల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భారత అణ్వస్త్ర విధానంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తొలిసారి ప్రయోగించబోమన్న విధానానికి కట్టుబడి ఉన్నామన్న ఆయన.. భవిష్యత్తు పరిణామాలు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. పాక్‌తో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న వేళ రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే రాజ్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఇమ్రాన్‌ తాజా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

భారత్‌తో సత్సంబంధాలకు పెంపొందించడానికి కృషి చేస్తానని అధికారంలోకి వచ్చిన కొత్తలో పలికిన ఇమ్రాన్‌ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఓవైపు ద్వైపాక్షిక చర్చలకు రావాలని పిలుస్తూనే.. మరోవైపు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు ఇమ్రాన్‌ అసమర్థ పాలనపై ప్రతిపక్షం తీవ్రంగా మండిపడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోతున్నారని దేశ వ్యాప్తంగా నిరసనలూ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌పై భారత్‌ పైచేయి సాధించడం ఆ దేశానికి అస్సలు మింగుడుపడటంలేదు. దీంతో ప్రతిపక్షాల దృష్టిని మరల్చేందుకు భారత్‌పై అర్థంపర్థంలేని ఆరోపణలతో ఇమ్రాన్‌ కాలం వెళ్లదీస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement