మంచినీళ్లలా ప్రచార ఖర్చు
వాషింగ్టన్/డెలవేర్: అమెరికా అధ్యక్ష అభ్యర్థులు ప్రచారం కోసం వందల కోట్లు వెదజల్లుతున్నారు.ప్రచారం, ఉద్యోగుల కోసం మంచినీళ్లలా డబ్బు ఖర్చుపెడుతున్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నెల వ్యవధిలో ప్రచార ఖర్చును రెండింతలు చేశారు. ప్రచార ఖర్చు, నిధుల సేకరణలో మాత్రం హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. సెప్టెంబర్‌లో ట్రంప్ రూ. 477 కోట్లు ఖర్చుపెట్టారు. సెప్టెంబర్ నెల ముగిసేసరికి తన వద్ద రూ. 236 కోట్లు ఉన్నాయంటూ ట్రంప్ ఎన్నికల సంఘానికి తెలిపారు.
ఆగస్టులో ట్రంప్ రూ. 284 కోట్ల నిధుల్ని సేకరించారు. ట్రంప్ ప్రచారం శిబిరంలో 350 మంది ఉద్యోగులు, కన్సల్టెంట్‌లు పనిచేస్తున్నారు. డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ సెప్టెంబర్ నెలలో ఏకంగా రూ. 561 కోట్లు ఖర్చుచేశారు. సెప్టెంబర్ ముగిసేనాటికి తన వద్ద రూ. 406 కోట్లు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో హిల్లరీ రూ. 501 కోట్ల నిధులు సేకరించారు. ఆమె 800 మందికి జీతాలు చెల్లిస్తున్నారు. ఆగస్టులో ఆమె 337 కోట్లు ఖర్చుపెట్టగా రూ. 404 కోట్ల నిధులు సేకరించారు.
ఫలితాన్ని సవాల్ చేసే హక్కుంది: ట్రంప్
అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తాను గెలిస్తేనే ఫలితాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తానని ట్రంప్ చెప్పారు. ‘ఎన్నికల ఫలితం ప్రశ్నార్థకమైనప్పుడు దానిని సవాల్ చేసే హక్కు తనకు ఉంటుందన్నారు. అక్రమ వలసదారులు డ్రైవింగ్ లెసైన్స్ కలిగివుంటే ఎన్నికల్లో ఓటు వే యొచ్చని హిల్లరీ శిబిరం పేర్కొన్నట్లు వికీలీక్స్ చెప్తోందన్నారు.
ట్రంప్‌పై ఆగని ఆరోపణలు
18 ఏళ్ల క్రితం ట్రంప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ యోగా శిక్ష కురాలు కరెనా వర్జినియా ఆరోపించారు. 1998లో యూఎస్ ఓపెన్ టోర్నమెంట్ స్టేడియం వెలుపల తనను గట్టిగా లాగి ఛాతిపై చేయి వేశాడన్నారు.