న్యూయార్క్ : రష్యా అధ్యక్షుడిగా నాలుగోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలుపడంపై ఇటు సొంత పార్టీలోనూ, అటు విపక్షాలనుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పుతిన్‌కు ట్రంప్ అభినందనలు తెలుపడాన్ని సొంత రిపబ్లికన్ పార్టీ సెనేటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. సిగ్గుపడాల్సిన రీతిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నియంతలను అభినందనలు తెలుపడం సరైంది కాదని, ఇలా చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడు స్వేచ్ఛాయుత ప్రపంచానికి నాయకత్వం వహించజాలడని ఆరిజోనా రిపబ్లికన్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ అన్నారు. సెనేటర్ జెఫ్ ఫ్లేక్, కెంటకీకి చెందిన సెనేట్ మెజారిటీ లీడర్ మిట్చ్ మెక్‌కన్నెల్ కూడా ట్రంప్ తీరును తప్పుబట్టారు.
పుతిన్‌కు ట్రంప్ అభినందనలు తెలుపడంపై అమెరికాలో విమర్శలు వ్యక్తం కావడానికి కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకొని.. ట్రంప్‌కు అనుకూలంగా పనిచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. తనకు అత్యంత మిత్రదేశమైన బ్రిటన్‌లో ఒక గూఢచారిపై రష్యా విష రసాయన దాడి జరుపడంతో.. ఆ దేశంపై అమెరికా మండిపడింది. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని ట్రంప్ యంత్రాంగమే ప్రకటనలు చేసింది. ఇక రష్యా ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా జరగలేదని అమెరికా అంటోంది. ఈ విమర్శలు, వివాదాలు ఎలా ఉన్నా.. పుతిన్‌ను బహిరంగంగా అభినందించడంలో ట్రంప్ ఏమాత్రం జంకకపోవడం.. ఆయన విమర్శకులను సైతం విస్మయ పరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment