ప్రపంచంలోని 95 శాతానికి పైగా జనాభా కాలుష్యంతో కూడిన ప్రమాదకరమైన గాలిని పీల్చాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా పట్టణప్రాంత ప్రజలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కోట్లాదిమందిని అసురక్షిత వాయువు బలిగొంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ముగ్గురిలో ఒకరు ఇంటా,బయట రెండు రెట్లు ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. అత్యధికంగా, అత్యల్పంగా కాలుష్యం బారిన దేశాల మధ్య అంతరం అతివేగంగా తగ్గిపోతున్నట్టు ఓ సమగ్ర అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్థారిత సురక్షిత ప్రమాణాలస్థాయి కంటే వాయుకాలుష్యం బారిన పడుతున్న ప్రజల సంఖ్యను అంచనా వేసేందుకు ఉపగ్రహ డేటా ద్వారా పర్యవేక్షించారు.
ఈ డేటా ఆధారంగా కొత్తగా కనుక్కున్న వివరాలతో అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్ ఇనిస్టిట్యూట్ తాజా నివేదిక రూపొందించింది. ప్రపంచస్థాయిలో అధిక రక్తపోటు, ఆహారపు అలవాట్లు, పోగత్రాగడం తర్వాత వాయుకాలుష్యం వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నట్టు తేలింది. గుండె జబ్బులు, గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్యాసకోశాల ఇన్‌ఫెక్షన్లతో దాదాపు 41 లక్షల మంది ముందుగానే చనిపోతున్నట్టు, ఇదొక అతి పెద్ద పర్యావరణ ఆరోగ్య ముప్పుగా పరిణమించినట్టు హెచ్చరించింది. బ్రిటన్‌తో సహా పలు దేశాల్లో డీజిల్ ఇంథనం వల్ల వాయుకాలుష్యం పెరుగుతోందని, రవాణా వాహనాలతో పాటు రోడ్లపై ఇతర వాహనాల రద్దీ బాగా పెరిగిపోవడం వల్ల ఈ కాలుష్యం విస్తరిస్తోందని పేర్కొంది.
మరణాల్లో సింహభాగం భారత్, చైనాలదే ...
ప్రపంచవ్యాప్తంగా 2016లో 60 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అందులో 50 శాతానికి పైగా భారత్, చైనాల్లోనే అదీకూడా ఎక్కువగా ఈ దేశాల రాజధానులు న్యూఢిల్లీ, బీజింగ్‌లలోనే జరిగినట్టు స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్–2018 నివేదిక పేర్కొంది. 2016లో భారత్‌లో 56 కోట్ల మంది,చైనాలో 41 కోట్ల మంది ఇళ్లలోపలే అంతర్గతంగా వ్యాపిస్తున్న కాలుష్యం బారిన పడినట్టు తెలిపింది. అతి సూక్ష్మస్థాయిలో ఘన, ద్రవ రూపాల్లోని కాలుష్యం మోతాదుకు మించి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, క్రమక్రమంగా మర ణానికి కారణమవుతున్నట్టు వెల్లడించింది. భారత్‌లో ఇళ్ల లోపలి కాలుష్యం (ఇండోర్ పొల్యుషన్) కారణంగా ప్రతీ నలుగురిలో ఒకరు, అదే చైనాలో ప్రతీ ఐదుగురిలో ఒకరు చనిపోతున్నారు. బొగ్గువాడకం తగ్గించడంతో, వాయుకాలుష్య నియంత్రణకు చైనా గట్టి చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో భారత్ కూడా ఇళ్లలోపలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎల్‌పీజీ వాడకం పెంచే చర్యలు మొదలుపెట్టిందని ఈ ఇనిస్టిట్యూట్ ఉపాధ్యక్షుడు బాబ్ ఓ కీఫె పేర్కొన్నారు.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment