'గ్లోబ‌ల్ కామ‌న్స్‌లో ఇది కూడా ఒక భాగమే' | India Challenges China Claims On South China Sea | Sakshi
Sakshi News home page

'గ్లోబ‌ల్ కామ‌న్స్‌లో ఇది కూడా ఒక భాగమే'

Published Mon, Jul 20 2020 3:34 PM | Last Updated on Mon, Jul 20 2020 4:13 PM

India Challenges China Claims On South China Sea  - Sakshi

ఢిల్లీ : దక్షిణ చైనా సముద్రంపై అమెరికా -చైనా మాటల యుద్ధం నెల‌కొన్న త‌రుణంలో  వ్యూహాత్మక జలమార్గం గ్లోబల్ కామన్స్‌లో భాగమని భార‌త్ ప్ర‌క‌టించింది. అంతర్జాతీయ చ‌ట్టానికి అనుగుణంగా నావిగేషన్ ,  చట్టబద్ధమైన వాణిజ్యం కోసం భార‌త్ నిలుస్తుంద‌ని పేర్కొంది.  ఈ మేరకు భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్ల‌డించారు. ఇదివ‌ర‌కు దక్షిణ చైనా సముద్రం గుండా నావిగేషన్ స్వేచ్ఛ కోసం పోరాడ‌తామ‌ని ఆస్ట్రేలియా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై ఆస్ట్రేలియా చాలా స్థిరమైన స్థానాన్ని అవలంభిస్తుందంటూ ప్రధాని స్కాట్ మోరిసన్ పేర్కొన్నారు. 

దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి  చైనా నిబంధ‌న‌లు ఉల్లంఘించింద‌ని న‌మ్మే దేశాల‌కు మ‌ద్ద‌తిస్తామ‌ని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ప్ర‌క‌ట‌న అనంత‌రం ఆస్ట్రేలియా, భార‌త్ నుంచి ఈ ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. సముద్ర సామ్రాజ్యాన్ని సృష్టించేందుకు  చైనా ప్ర‌య‌త్నిస్తోంద‌ని అమెరికా ఆరోపించించిన సంగ‌తి తెలిసిందే. దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి  చైనా చేసిన వాదనలను చట్టవిరుద్ధమని జూలై 13న పాంపియో పేర్కొన్నారు.  అయితే ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో రెండు ప్ర‌పంచ శ‌క్తిమంత‌మైన దేశాల మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్న త‌రుణంలో  జలమార్గంలోనూ  ఇబ్బందులను కలిగించడానికి అమెరికా ప్రయత్నిస్తోందని బీజింగ్ ఆరోపించింది. (ఆ ఆరోపణలు అర్థం లేనివి : చైనా)

దక్షిణ చైనా సముద్రం చుట్టుపక్కల ఉన్న ఆయిల్, గ్యాస్​ నిల్వలపై కన్నేసే ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించింది. దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వల్లో 90 శాతం తనదేననేది చైనా వాదన. దీనిపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం చెబుతున్నాయి. తమకూ ఈ సహజ నిల్వలపై హక్కు ఉందంటున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా సంక్షోభం నెలకొన్న సమయంలో చైనా ఆ ప్రాంతంపై అధిపత్యం కోసం ప్రయత్నాలు ముమ్మురం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చైనా తన ప్రాదేశిక ఆశయాల కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే 
(దక్షిణ చైనా సముద్ర వివాదం.. స్పందించిన చైనా)


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement