ఇరాన్ తో భారత్ కీలక ఒప్పందం
టెహ్రాన్: ఇరాన్ పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ తో 12 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో మోదీ ఆ దేశాధ్యక్షుడు హాసన్ రౌహానితో సమావేశమయ్యారు. దైపాక్షిక సంబంధాల్లో భాగంగా కీలకమైన చాబహార్ పోర్టు నిర్మాణానికి భారత్ 500 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం చేస్తుందని మోదీ ప్రకటించారు. చాహాబర్ పోర్టు భారత్-ఇరాన్ ల మధ్య సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని హాసన్ అన్నారు. భారత్, ఇరాన్ లు కొత్త స్నేహితులేంకారని పూర్వం నుంచే ఇరాన్ తో భారత్ కు మంచి సంబంధాలున్నాయని మోదీ తెలిపారు.
కాగా, భారత్ ఇతర దేశాల కోసం నిర్మించనున్న మొదటి పోర్టు ఇదే కావడం గమనార్హం. ఈ పోర్టు నిర్మాణం పూర్తయితే పాకిస్తాన్ తో సంబంధం లేకుండా మధ్య ఆసియా దేశాల నుంచి భారత్ కు సముద్ర మార్గం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఎగుమతులు, దిగుమతులకు రవాణా సులభతరం కానుంది. పాకిస్తాన్ కు చెందిన సముద్రభాగం నుంచి ఎటువంటి రవాణాకు ఆ దేశం అంగీకరించకపోవడంతో ఇప్పటివరకు మధ్య ఆసియా దేశాలతో భారత్ కు పెద్దగా వ్యాపార సంబంధాలేవీ లేకుండా పోయాయి.
దీంతో భారత్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా.. అటువైపు పాకిస్తాన్ కు గ్వాదర్ పోర్టు నిర్మించి ఇస్తూ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటున్న చైనాకు కూడా చెక్ పెట్టేసింది. పనిలో పనిగా ఇరాన్ లోని పోర్టు నుంచి అక్కడి ముఖ్యనగరాల్లో ఒకదానికి 500 కిలోమీటర్ల మేర వేయనున్న రైల్వే మార్గానికి కూడా సాయం చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎకనమీ, ట్రాన్స్ పోర్టెషన్, పోర్టు డెవలప్ మెంట్, కల్చర్, సైన్స్, అకడమిక్ కో-ఆపరేషన్ తదితరాలపై ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. చివరగా15 ఏళ్ల కిందట అప్పటి భారత ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ఇరాన్ లో పర్యటించారు.